బయటపడ్డ మున్సిపల్ కమిషనర్ ఆగడాలు

by Shyam |

<p>దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. తనకేం కాదనుకుంటున్నాడో &#8230; తననేం చేయరని భావిస్తున్నాడో&#8230; తనకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయనుకుంటున్నాడో తెలియదు కానీ.. తన కింది స్థాయి సిబ్బందిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా క్రింది స్థాయి సిబ్బందిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతున్నారని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరు నచ్చక సిద్దిపేట మున్సిపాలిటీలో [&hellip;]</p>

బయటపడ్డ మున్సిపల్ కమిషనర్ ఆగడాలు
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. తనకేం కాదనుకుంటున్నాడో … తననేం చేయరని భావిస్తున్నాడో… తనకి అధికార పార్టీ అండదండలు ఉన్నాయనుకుంటున్నాడో తెలియదు కానీ.. తన కింది స్థాయి సిబ్బందిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా క్రింది స్థాయి సిబ్బందిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతున్నారని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరు నచ్చక సిద్దిపేట మున్సిపాలిటీలో విధులు నిర్వహించే బిల్ కలక్టర్లు గత మూడు రోజులుగా విధులకు కూడా హాజరు కావడం లేదు. మున్సిపల్ కమిషనర్ తన కింది స్థాయి సిబ్బందితో ఎలా వ్యవహరిస్తున్నాడనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది. టార్గెట్లు విధిస్తూ, కింది స్థాయి సిబ్బందిపై దుర్భాషలాడటంపై అధికారులు, ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

కమిషనర్‌కు అధికార పార్టీ అండదండలు…

సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగుతున్న రిటైర్డు మున్సిపల్ కమిషనర్ రమణాచారికి అధికార పార్టీ అండదండలు మెండుగా ఉన్నాయి. గతంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన కొంతకాలం సిరిసిల్ల పట్టణానికి బదిలీ అయ్యారు . అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రభుత్వం సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సుడా)కు వైస్ చైర్మన్‌గా నియమించింది. అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో … పరోక్షంగా సిద్దిపేట మున్సిపల్ బాధ్యతలు నిర్వహించేవారు. అంతకుముందు సిద్దిపేట పట్టణ కమిషనర్‌గా కొనసాగిన శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ బదిలీ చేశారు. అప్పటినుంచి సుడా వైస్ చైర్మన్ బాధ్యలతో పాటు సిద్దిపేట పట్టణ ఇంఛార్జీ కమిషనర్‌గా కొనసాగుతూ వస్తున్నారు.

ప్రస్తుతం సుడా బాధ్యతలు వదిలి పూర్తిగా సిద్దిపేట పట్టణ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే పట్టణానికి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం … రిటైరైనా కమిషనర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ప్రతిపక్ష నాయకుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో, ముఖ్యంగా జిల్లా మంత్రి ఆలోచన మేరకే మున్సిపల్ కమిషనర్ గా రమణాచారి కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ సైతం అధికార పార్టీకి అనుకూలంగా .. ప్రతిపక్ష నాయకులకు ప్రతికూలంగా మాట్లాడటం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

కింది స్థాయి సిబ్బందిపై దుర్భాషలాట ….

అధికార పార్టీ అండదండలతో మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నారు. ఏకంగా తన కింద పనిచేసే సిబ్బందితో దుర్భాషలాడటం ఇందుకు నిదర్శనం. నిత్యం తమను వేధింపులకు గురి చేస్తున్నారని, పని సమయాల కంటే ఎక్కువ టైం పనిచేస్తున్నామని, రాత్రి వేళలు, సెలవు దినాల్లో కూడా పని చేయిస్తున్నాడని గతంలో మున్సిపల్ కమిషనర్ తీరుపై కింది స్థాయి సిబ్బంది అగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కమిషనర్ తన తీరు మార్చుకోవడం లేదు. రోజు వారిగా బిల్ కలెక్టర్లకు టార్గెట్లు విధిస్తూ టార్గెట్ పూర్తి చేయని వారిని ఇష్టమొచ్చినట్టుగా దుర్భాషలాడటంతో బిల్ కలెక్టర్లు మూడు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. టార్గెట్లు పూర్తి చేయని వారిపై కమిషనర్ బూతు పురాణం వినలేకపోతున్నామని, తన మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని, నోటికి ఎంత వస్తే అంత తిడుతున్నాడని బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. దీనిపై స్పందించాల్సిన ఉలన్నతాధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వీరొకరే కాదు .. ఇతర డిపార్టుమెంట్లలో పనిచేసే వారు సైతం మున్సిపల్ కమిషనర్ తీరు నచ్చక …. ఉద్యోగాన్ని కష్టంగా చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్‌ను తొలగించాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story