ఇక ‘లైవ్ కన్సర్ట్’.. హోమ్ డెలివరీ!

by  |
ఇక ‘లైవ్ కన్సర్ట్’.. హోమ్ డెలివరీ!
X

దిశ, ఫీచర్స్ : పిజ్జా టు ఫ్రిజ్, హలీమ్ నుంచి హారతి కర్పూరం బిల్లల వరకు ప్రతీ వస్తువు నేరుగా మన ఇంటి తలుపుతడుతున్న విషయం తెలిసిందే. ఇక పాండమిక్ టైమ్‌లో కాంటాక్ట్‌లెస్ డెలివరీలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇదే క్రమంలో ‘మ్యూజిక్’ను కూడా ఇంటికి తెచ్చేసుకుంటే భలే ఉంటుంది కదా.. ఏంటి అర్థం కాలేదా? బిర్యానీ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్‌ సెటప్‌ను డాబా మీదే అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ‘కన్సర్ట్’ పెట్టుకోవడమే కొంచెం కష్టం! అయితే తాజాగా ఓ బ్యాండ్ మాత్రం.. ఏకంగా ఇంటికొచ్చి లైవ్ మ్యూజిక్‌తో పాడతామని అంటోంది.

కరోనా ఎంతోమంది జీవితాలను తలకిందులు చేసింది. ఏడాదిన్నర కాలం నుంచి ఎన్నో వ్యాపారాలకు తాళం వేయించింది. ఇక లాక్‌డౌన్ ఎఫెక్ట్‌‌తో చాలా వరకు ‘కన్సర్ట్ వెన్యూస్’( కచేరీ వేదికలు) మూసివేయడంతో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన కచేరీ ప్రమోటర్ కేసీ టర్నర్, సంగీతకారుడు మెగాన్ స్లాంకార్డ్ ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ‘లైవ్ మ్యూజిక్’‌ను డ్రైవ్ వేస్‌లో లేదా బ్యాక్‌యార్డ్స్‌లో ప్రదర్శిస్తామని చెబుతున్నారు. కాలిఫోర్నియాలో ఈ ఐడియా ఎంతోమందిని అట్రాక్ట్ చేయడంతో ప్రస్తుతం వీరిద్దరూ ఎంతోమంది ఇంటి బ్యాక్‌యార్డ్‌లో తమ సంగీత హోరు వినిపిస్తున్నారు. 20 మంది బృందంతో లైవ్ మ్యూజిక్ అందిస్తూ ఇంటి సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

చాలా రోజుల తర్వాత ప్రజలతో మమేకం కావడం, వారికోసం మళ్ళీ పాడటం బాగుంది. నాలో సంతోషాన్ని నింపడానికి, జీవనోపాధికి ఇది అవసరం. ఇక పాండమిక్ టైమ్‌లో సంగీతం మనలోని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా గాయాలను మాన్పిస్తుంది. మా ప్రదర్శనల వేళ ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. పది మందికి మించి ప్రేక్షకులు ఉంటున్నారు. కానీ వారు మా నుంచి 12 అడుగుల దూరంలో ఉండాలి. ఇంటి యజమానులు తమ సమయానికి అనుకూలంగా ప్రదర్శనలను బుక్ చేస్తారు. అతిథులను ఆహ్వానిస్తారు. ఆర్టిస్ట్ ఆధారంగా ఫీజులు 1,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు ఉంటాయి. లక్ష మంది కోసం పాడుతున్నామా లేదా 20/30 మందికి పాడుతున్నామా అనేది ముఖ్యం కాదు. ప్రజలతో తిరిగి కనెక్ట్ కావడమే ప్రధానం.
– కేసీ టర్నర్, కచేరీ ప్రమోటర్

అంటే.. ఇక ‘లైవ్ కన్సర్ట్స్’ కూడా హోమ్ డెలివరీ మెనూలో చేరిపోయాయన్న మాట!

Next Story

Most Viewed