హైదరాబాద్ స్పెషల్..సువాసనలు వెదజల్లే బొగ్గు పూలు

by  |
హైదరాబాద్ స్పెషల్..సువాసనలు వెదజల్లే బొగ్గు పూలు
X

దిశ, కుత్బుల్లాపూర్: ఆర్కిడ్​ఫ్లవర్స్.. పూలన్నింటిలో స్పెషల్. కన్నులను దోచే అందం. మనస్సుకు హాయి కలింగించే పరిమళం ఈ పుష్పాల ప్రత్యేకత. ఇక సాగులో డిఫరెంట్​స్టైల్. మొక్కలు మట్టి సాయంతో కాకుండా బొగ్గు సాయంతో పెరుగుతాయి. నీటి తేమతోనే పెరుగుతూ.. నల్లటి కోల్ నుంచి ఆకర్శించే రంగులతో పూలు వికసిస్తాయి. ఇవి ఎప్పుడు సమ్​థింగ్​ స్పెషలే. బొకెల్లో.. భవంతుల బాల్కనీల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. అయితే వీటి సాగు ఎలా.. ఇవి ఎక్కడ లభిస్తాయనేది చాలా మందికి తెలియదు. బొగ్గులోంచి సువాసన కలిగిన ఆర్కిడ్ పూలు పరిమళిస్తాయంటే ఆశ్చర్యం వేయకమానదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుత్బుల్లాపూర్ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో విజయవంతంగా ఈ పూలను సాగు చేస్తున్నారు.

పంట సాగు విధానం..

ఆర్కిడ్ పూలను బొగ్గులో మాత్రమే పండిస్తారు. తేమ ఎక్కువగా ఉండటం వల్ల బొగ్గులోనే సాగు చేస్తారని అధికారులు చెబుతున్నారు. గతంలో భారీ వృక్షాల కొమ్మలు, బెరడ్ల మధ్యలో మాత్రమే పండించే వారట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 20 గుంటల పాలీ హౌజ్ లో ఈ పంటను ప్రత్యేక శ్రద్ధతో పండిస్తున్నారు. రాడ్లపై జాలిలా కట్టి బొగ్గును వేశారు. దీనిలో మొక్కలు నాటి ఉదయం, సాయంత్రం సమయాల్లో పది నిమిషాల పాటు కృత్రిమ వర్షంలా నీటిని చల్లిస్తున్నారు. నెట్(జాలీ) కింద భాగంలో మిస్టర్స్ ద్వారా నీటిని వదిలితే ఆ నీటి ద్వారా వచ్చే బిందువులు(తుంపర్లు)ను బొగ్గు ఆకర్షించుకొని మొక్కల వేర్లకు శోచించుకుంటాయి. మొక్క వేర్లు బొగ్గుతో పాటు కిందికి వేలాడుతూ తేమను పీల్చుకొని పెరుగుతాయి.

ఉపయోగాలు..

ఆర్కిడ్ పూలను ఎక్కువగా శుభకార్యాల సమయంలో ఉపయోగిస్తారు. ప్రధానంగా పెళ్లి పందిర్లు, పూల దండలు, బొకేల కోసం వాడుతారు. ఆరు నెలలకోసారి వచ్చే పూలతో పాటు పూలు పూయడం పూర్తయ్యాక ఆకులను సైతం బొకేల్లో వాడుతారు. గతంలో సిక్కిం, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాల నుంచి ఈ పూలను దిగుమతి చేసుకునే వారని తెలిసింది. ప్రభుత్వ చొరవతో మన దగ్గర పండిస్తూ విక్రయించడం వల్ల ఖర్చుతో సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.

మొక్కల దిగుమతి..

ఈ మొక్కలను ప్రభుత్వం థాయ్ లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒక్కో మొక్కకు రవాణా ఖర్చులతో కలిపి రూ.40 కి కొనుగోలు చేస్తోంది. ఆరు నెలలకోసారి వచ్చే ఈ పూత వల్ల ప్రయోజనం తక్కువే అనిపించవచ్చు. కానీ ఈ మొక్కకు చావనేది ఉండదు. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు పెట్టడం, అది కూడా పెరగడం వల్ల చావనేది రాదు. ఒక మొక్క 7 నుంచి 8 గుత్తిలు లేదా సగటున 4 గుత్తిలు మాత్రం తప్పకుండా పూస్తుంది. ఒక గుత్తి రూ.15 నుంచి రూ.25 కు వరకు విక్రయించవచ్చు. 20 గుంటల భూమిలో 20 వేల మొక్కలను నాటితే 80 వేల గుత్తిల వరకు పంట వస్తుంది.

అందం.. ఆహ్లాదం..

ఆర్కిడ్ మొక్కలను కేవలం వ్యాపార కోణంతోనే కాకుండా ఇష్టంగా పెంచుకుంటారు. ఇంట్లోని బాల్కనీలు, టీవీల పక్కన, పడక గదిలోనూ పెట్టుకోవచ్చు. అందంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుంది. జీడిమెట్ల సీఓఈలో చేస్తున్న సాగుతో వచ్చిన పూల మొక్కలను ప్రత్యేక కుండీల్లో పెట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ లో దీని ధర రూ.600 వరకు ఉంటుండగా సీఓఈలో మాత్రం కేవలం రూ.300 లకే అందిస్తోంది. సాగు బాగుంది, జీడిమెట్లలో చేస్తున్న సాగు మంచిగా ఉంది. ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహంతో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. రైతులు వేస్తామంటే శిక్షణను ఇస్తాం. కుండీలను కూడా విక్రయిస్తున్నాం. అవసరమైన వారు 7997724922 నెంబర్ లో సంప్రదించవచ్చు.


Next Story

Most Viewed