సమీకృత పాఠశాలలు.. కావాలి ప్రగతికి ప్రతీకలు

by Bhoopathi Nagaiah |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపన.

సమీకృత పాఠశాలలు.. కావాలి ప్రగతికి ప్రతీకలు
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపన. రాష్ట్రంలో దాదాపు ముప్పై సమీకృత పాఠశాలల నిర్మాణానికై మంత్రులు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గ్ గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఈ సమీకృత పాఠశాలల నిర్మాణం పూర్తి అయితే విద్యారంగంలో తెలంగాణ ఒక గొప్ప మైలు రాయిని దాటినట్టే.. విద్యార్థులను విడదీసి విద్యా బోధన చేయడం ద్వారా వారిలో ఒకరకమైన అనారోగ్య విత్తనాన్ని నాటడం జరిగింది.

అలా కాకుండా ధనిక, బీద, కుల వివక్ష లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించి ఉంటే ఈ పాటికి అందరూ సమానమనే భావం పురుడుపోసుకునేది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం ముదావహం. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటిలెక్చువల్ స్కూల్స్ కావాలి. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి భావి భారత యువతకు బంగారు భవిష్యత్‌ను ఇవ్వాలి.

వర్గీకరణతో మంచి కన్నా చెడే జరిగిందా?

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు విద్యారంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం గణనీయమైన ప్రగతి సాధించలేదనే చెప్పాలి. మనకన్నా చిన్న దేశాలైన ఫిన్లాండ్, దక్షిణ కొరియా, జపాన్, డెన్మార్క్ అత్యుత్తమ విద్యను అందిస్తున్నాయి. అక్కడ అందరికీ సమాన అవకాశాలున్నాయి. మన దేశంలో ప్రభుత్వ పాఠశాలలు ఉనికిలోకి వచ్చాక ప్రభుత్వాలు విద్య అందరికీ అందుబాటులో తేవాలనే సంకల్పంతో గిరిజన, ఎస్సీ, ఎస్టీ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు స్థాపించారు. ఈ విధమైన వర్గీకరణతో పాఠశాలలు నిర్మించడం వల్ల మంచి కన్నా చెడే జరిగింది అని చెప్పవచ్చు. భారత దేశం కేవలం వివిధ రాష్ట్రాలు గానే కాకుండా ప్రజలు కుల, మతాలు ప్రాతిపదికగా విభజించబడింది. ప్రభుత్వాలు కుల మతాలకు అతీతంగా వ్యవహరించాల్సింది పోయి కుల మతాలను ప్రోత్సహిస్తూ పోషిస్తున్నాయి. తద్వారా కుల మత వ్యవస్థ మరింత వేళ్ళూనుకుంటుంది. విద్యార్థి దశలోనే వారి లేత మనస్సులో ఒక విధమైన వివక్ష, వేర్పాటువాదం బీజం వేస్తుంది. బీద, ధనిక అనే భావం ఏర్పడుతుంది.

సమాన విద్యావకాశాల లేమి

విద్యార్థులను విడదీసి విద్యా బోధన చేయడం ద్వారా వారిలో ఒకరకమైన అనారోగ్య విత్తనాన్ని నాటడం జరిగింది. అలా కాకుండా ధనిక, బీద, కుల వివక్ష లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించి ఉంటే ఈ పాటికి అందరూ సమానమనే భావం పురుడుపోసుకునేది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం ముదావహం. అయితే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు సమాన అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. కానీ ఆ పాఠశాలల్లో అందరికీ సమాన హక్కులు అవకాశాలు ఉండాలి. అగ్ర వర్ణ (FC) లేదా ఇతర కులాలకు (OC)కూడా అంతే అవకాశం కల్పించాలి. విద్యను అభ్యసించడానికి బీదరికం, కులం అడ్డుగోడలు కారాదు. ఇప్పుడున్న SC, ST, BC ల హాస్టళ్లు, పాఠశాలలు క్రమేపి పేర్లు మార్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌గా మార్చి అందరికీ సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలి. కులం, మతం, బీదరికం, ధనికం అనే వివక్షలేని విద్యను అందించాలి.

కులం, మతం, ఆదాయం కాలమ్స్ వద్దు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో మాట్లాడుతూ ఎలాంటి కుల మత భేదాలు, విబేధాలు, తారతమ్యాలు లేని సమ సమాజ నిర్మాణానికి బాటలు వేసే ఆధునిక పాఠశాలలు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని వర్ణించారు. అదే కనుక నిజం కావాలంటే ఆయా స్కూళ్లను మరిన్ని స్థాపించాలి. ఇప్పుడున్న SC, ST, BC, మైనారిటీ విద్యా సంస్థలను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా మార్చాలి. అడ్మిషన్ ప్రక్రియలో కులం, మతం, ఆదాయం అనే కాలమ్స్ తీసివేయాలి. విద్యకు బడ్జెట్లో పెద్ద పీట వెయ్యాలి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించాలి. ఆధునికమైన, నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలలో అందిస్తే ప్రైవేటు విద్యా సంస్థలకు చరమ గీతం పాడవచ్చు. ప్రతి గ్రామ విద్యార్థికి అదే గ్రామంలో పదవ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ జూనియర్ కళాశాలను స్థాపించాలి. అండర్ గ్రాడ్యుయేట్ విద్య విద్యార్థి అభిరుచి మేరకు నేర్చుకునే సౌలభ్యం కల్పించాలి పట్టణాలలో, నగరాలలో జూనియర్ కళాశాల స్థాయి విద్య వరకు తమకి సమీపంలోనే అందే ఏర్పాటు చెయ్యాలి. చదువులకోసం సుదూర ప్రయాణాలు చేయడం విలువైన సమయం వృథా చేయడమే అవుతుంది. విద్య పై పెట్టుబడి భారంగా కాకుండా బాధ్యతగా భావించి భవ్య భారతాన్ని నిర్మించడానికి సోపానంగా ప్రభుత్వాలు భావించాలి.

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి.

ఈ డిజిటల్ యుగంలో ఏ ఒక్కరూ విద్యకు దూరం కావద్దు. ప్రపంచంలో 20% జనాభా ఉన్న భారత్ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా విద్యలో సర్వతోముఖాభివృది సాధించకపోవడం ప్రపంచ స్థాయి విద్యాలయాలు లేకపోవడం, ఉన్నత విద్యకోసం జర్మనీ, కెనడా , బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బాటపట్టడం ఎంతైనా విచారకరం. కేవలం విద్య అందివ్వడం, ఉపాధి అవకాశాలకోసం ప్రభుత్వాలపై ఆధారపడేట్లు కాకుండా ప్రతి విద్యార్థి స్వయం చోదక శక్తిగా ఎదిగే విధంగా విద్యా విధానాన్ని మార్చాలి. పాఠశాల స్థాయి నుండే పరిశ్రమలకు విద్యార్థులను అనుసంధానం చెయ్యాలి.))

వలసలు పోయే పరిస్థితికి చెక్

ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యార్థి సమగ్ర అభివృద్దికి దోహదపడాలి. విద్య, ఉపాధికోసం వలసలు పోయే పరిస్థితికి చెక్ పెట్టాలి.. విద్యను అభ్యసించడం అంటే కేవలం అక్షరాస్యులు కావడం కాదు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. శ్రమైక జీవన సౌందర్యానికి విద్యార్థులను తీర్చిదిద్దాలి. చిన్నప్పటి నుండే శ్రమించే తత్వాన్ని పాదుకొల్పాలి. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.. ఇంటిలెక్చువల్ స్కూల్స్ కావాలి. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి భావి భారత యువతకు బంగారు భవిష్యత్ ను ఇవ్వాలి.

- శిరందాస్ శ్రీనివాస్

ప్రిన్సిపాల్, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల,

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాద్.

94416 73339

Next Story