Ex Army chief: వార్ బాలీవుడ్ సినిమా కాదు.. రొమాంటిక్ గా ఉండదు.. ఆర్మీ మాజీ చీఫ్ కామెంట్స్

by Shamantha N |   (  Updated:2025-05-12 06:36:24  IST  )

భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడటం మానేయాలని ఆపరేషన్ సిందూర్ బలమైన సందేశాన్ని పంపిందన్నారు.

Ex Army chief: వార్ బాలీవుడ్ సినిమా కాదు.. రొమాంటిక్ గా ఉండదు.. ఆర్మీ మాజీ చీఫ్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడటం మానేయాలని ఆపరేషన్ సిందూర్ బలమైన సందేశాన్ని పంపిందన్నారు. పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో జరిగిన డైమండ్ జూబ్లీ వేడుకల్లో నరవణే పాల్గొని ప్రసంగించారు. కాల్పుల విరమణ తర్వాత ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా, భారత్, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చారు. యుద్ధం వల్ల కలిగే నష్టాల గురించి, దానివల్ల జరిగే గాయాల గురించి మాట్లాడారు. "వార్ అంటే బాలీవుడ్ సినిమా కాదు. యుద్ధం అంత రొమాంటిక్ గా ఉండదు. అదో సీరియస్ బిజినెస్. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి ఉంటుంది." అని ఆయన అన్నారు. యుద్ధం సమయంలో దౌత్యం ఆవశ్యకతను జనరల్ నరవణే నొక్కి చెప్పారు. “యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తా” అని అన్నారు.

ఆర్థిక నష్టం గురించి

యుద్ధం వల్ల జరిగే ఆర్థిక నష్టం గురించి కూడా నరవణే మాట్లారు. మిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాల నష్టం జరుగుతోందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపుతాయన్నారు. అయితే, సంఘర్షణను నివారించడానికి రక్షణ రంగంలో, సైన్యంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యమని అన్నారు. " విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం కంటే రక్షణకు ఎంత ఖర్చు చేయాలనే దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. రక్షణ వ్యయం వృథా కాదు, దేశానికి అవసరమైన బీమా. సన్నద్ధమైన సైన్యం సంఘర్షణను నివారించడానికి సహాయపడుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది. యుద్ధం ఖరీదైంది. దాని పర్యవసానాలు మరింత ఖరీదైనవి. అందువల్ల, జాతీయ భద్రతకు ఇటువంటి పెట్టుబడి చాలా కీలకం" అని ఆయన అన్నారు. భారతదేశం పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లలేదని జరుగుతున్న చర్చపై ఆయన స్పందించారు.

Next Story