ఆ తొమ్మిది స్థావరాలే టార్గెట్‌గా కదిలిన IAF.. భారత్‌లో దాడులకు గుణపాఠం

by Kema Shiva Kumar |

భారత వైమానిక దళం మంగళవారం అర్ధరాత్రి చేపట్టిన మెరుపుదాడుల్లో పాకిస్తాన్, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.

ఆ తొమ్మిది స్థావరాలే టార్గెట్‌గా కదిలిన IAF.. భారత్‌లో దాడులకు గుణపాఠం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళం మంగళవారం అర్ధరాత్రి చేపట్టిన మెరుపుదాడుల్లో పాకిస్తాన్, పీవోకేల్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఇందులో నాలుగు పాకిస్తాన్‌లో ఉండగా, ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. లష్కర్ ఎ తాయిబాకు చెందిన మూడు, జైషే మహమ్మద్‌కు చెందిన నాలుగు, హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన రెండు టెర్రర్ క్యాంపులు ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైపోయాయి. అయితే, భారత్ ఈ శిబిరాలను ఎందుకు ఎంచుకున్నదనే చర్చ జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో జరిగిన భారీ ఉగ్రదాడులకు, నిత్యం సరిహద్దుల్లో చొరబాట్లు, బార్డర్ సమీపంలో కాల్పులకు ఈ ఉగ్రక్యాంపులతో లింకులు ఉన్నాయి. భారత నిఘా సంస్థలు ఈ విషయాలను ధ్రువీకరించాయి. అందుకే ఐఏఎఫ్ ఈ శిబిరాలను టార్గెట్లుగా డిసైడ్ చేసుకుంది. ఒక్కో ఉగ్ర శిబిరం గురించి కొంచెం వివరంగా చర్చిద్దాం.

బహవల్పూర్: జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్స్ (బార్డర్ నుంచి 100 కి.మీ.)

పాకిస్తాన్‌లో దక్షిణ పంజాబ్‌లో బహవల్పూర్ ఉన్నది. ఇది భారత వైమానిక దళానికి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఎందుకంటే ఇది జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్ కూడా. మసూద్ అజహర్ చీఫ్‌గా సాగుతున్న ఈ ఉగ్రసంస్థ భారత్‌లో జరిగిన అనేక భారీ ఉగ్ర ఘటనలకు బాధ్యత వహించింది. 2001లో పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామా సూసైడ్ బాంబింగ్ వంటి ఘటనలకు ఈ సంస్థనే బాధ్యత వహించింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్లకు లోన ఉన్నది. కానీ, రాఫెల్ యుద్ధ విమానం తన మిస్సైల్ సత్తాతో ఈ హెడ్‌క్వార్టర్‌ను భూస్థాపితం చేసింది.

మురిద్కే : లష్కర్ ఎ తాయిబా (బార్డర్ నుంచి 18 నుంచి 25 కి.మీ.)

ఉత్తర లాహోర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే మురిద్కేలో లష్కర్ ఎ తాయిబా, దాని చారిటేబుల్ వింగ్ జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థలు ప్రధానంగా పని చేస్తున్నాయి. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపులు ఉగ్ర శిక్షణ, ఉగ్రవాదులకు లాజిస్టికల్ సపోర్ట్ వంటివి అందిస్తుంది. 2008లో ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రసంస్థల్లో లష్కర్ కూడా ఉన్నది. 26/11 దాడులకు ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.

కోట్లీ : బాంబర్ ట్రైనింగ్ (ఎల్వోసీ నుంచి 20 కి.మీ.)

పీవోకేలోని కోట్లీలో టెర్రర్ క్యాంప్‌పై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ సూసైడ్ బాంబర్లు, తిరుగుబాటుదారులకు శిక్షణ అందిస్తున్నది. ఏకకాలంలో ఇక్కడ సుమారు 50 మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఉన్నది.

గుల్పూర్ : రజౌరీ, పూంచ్‌ల దాడులకు లాంచ్‌ప్యాడ్ (ఎల్‌వోసీ నుంచి 30 కి.మీ.)

జమ్ము కశ్మీర్ రజౌరీ, పూంచ్ సెక్టార్‌లలో 2023, 2024 మధ్య తరుచూ కాల్పులు జరపడానికి ఉగ్రవాదులకు ఈ గుల్పూర్ క్యాంపు ఒక లాంచ్ ప్యాడ్‌గా పని చేసింది. భారత భద్రతా బలగాల వాహనాల శ్రేణిపై, పౌరులను టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి ఈ లాంచ్ ప్యాడ్‌లనే ఉగ్రవాదులు ఉపయోగించుకున్నట్టు చెబుతున్నారు.

సవాయ్ : కశ్మీర్‌లోయలో లష్కర్(ఎల్‌వోసీ నుంచి 30 కి.మీ.)

ఉత్తర కశ్మీర్ లోయలోని సోన్‌మార్గ్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాల్లో తరుచూ దాడులకు ఈ సవాయ్ క్యాంపుతోనే లింకులు ఉన్నాయి.

సర్జాల్, బర్నాలా : చొరబాటుదారులకు దారి (సరిహద్దు నుంచి 6 కి.మీ.)

అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌వోసీకి సమీపంగా ఉన్న ఈ సర్జల్, బర్నాలా ఏరియాలు భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడటానికి గేట్‌వేగా ఉన్నట్టు చెబుతున్నారు.

మెహమూనా : హిజ్బుల్‌కు కేంద్రం (బార్డర్ నుంచి 12 నుంచి 18 కి.మీ.)

సియాల్‌కోట్ సమీపంలోని మెహమూనా క్యాంపులో హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకలాపాలు సాగేవి. కశ్మీర్‌లో దీర్ఘకాలంగా యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాదసంస్థల్లో ప్రధానంగా హిజ్బుల్ ఉంటుంది. ఇటీవలి కొన్నేళ్ల నుంచి సంస్థ మెల్లిగా బలహీనపడుతున్నది. కశ్మీర్‌ లోయలో హిజ్బుల్‌ పట్టు కోల్పోతున్నా.. మెహమూనా ఏరియాలో మంచి మద్దతు ఆ ఉగ్రవాద సంస్థకు ఉన్నదని, అందుకే అది ఇంకా పటిష్టంగానే కొనసాగుతున్నట్టు వివరిస్తున్నారు.

Next Story