Baloch rebels: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దు.. కాల్పుల విరమణపై బలూచ్ రెబల్స్ వ్యాఖ్యలు

by Shamantha N |

‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ తర్వాత భారత్- పాక్(India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా.. సైనిక ఘర్షణను ఆపేందుకు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Baloch rebels: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దు.. కాల్పుల విరమణపై బలూచ్ రెబల్స్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ తర్వాత భారత్- పాక్(India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా.. సైనిక ఘర్షణను ఆపేందుకు ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్‌ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దని సూచించింది. ‘‘పాకిస్థాన్‌ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలన్నీ మోసం. అవన్నీ ఒక యుద్ధ వ్యూహం.. తాత్కాలిక ప్లాన్ మాత్రమే’’ అని బలూచ్‌ పేర్కొంది. ఈనేపథ్యంలో ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్‌కు సూచించింది (Baloch Liberation Army) మరోవైపు, బలూచ్ ఫారిన్ ప్రాక్సీ అని వస్తున్న విమర్శలను ఆ సంస్థ తోసిపుచ్చింది.‘‘మేము కీలుబొమ్మలం కాదు. మౌనంగా చూస్తూ ఉండిపోయే రకం కాదు. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత, భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. మా పాత్ర ఏంటో మాకు పూర్తిగా తెలుసు’’ అని వెల్లడించింది. వారిది ఒక డైనమిక్‌, నిర్ణయాత్మక పార్టీ అని పేర్కొంది.

51 లక్ష్యాలపై దాడులు..

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని కాలత్‌ జిల్లా మంగోచర్‌ సిటీని స్వాధీనం చేసుకున్న శనివారం బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. మొత్తం 51 లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. శుక్రవారం కూడా పాక్‌ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాటుదారులు దాడి చేయగా.. 22 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మార్చి నెలలో బలూచ్‌ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఇకపోతే, బలూచ్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు సహా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం వల్లే పాక్ ఖజానా నిండుతోంది. కానీ, అక్కడ పేదరికం తీవ్రంగా ఉంది. జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధి జరగట్లేదు. దీంతో, అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. వేర్పాటువాదులు శక్తిమంతంగా మారారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

Next Story