ఉగ్రవాదానికి పాక్ స్వర్గధామమైంది.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ విక్రమ్ మిస్రీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 09:20:10  IST  )

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.

ఉగ్రవాదానికి పాక్ స్వర్గధామమైంది.. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ విక్రమ్ మిస్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ‘ఆపరేషన్ సిందూర్’‌పై త్రివిధ దళాధిపతులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ఉగ్రమూకలు దేశంలో సృష్టించిన మారణకాండపై పలు వీడియోలను ప్రదర్శించారు. అనంతరం విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. పార్లమెంట్ దాడి నుంచి పహల్గాం వరకు ఇప్పటికి పాక్ ఉగ్ర దాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారని పేర్కొన్నారు. పహల్గాం టెర్రర్ అటాక్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను విచక్షణారహితంగా కాల్చి చంపారని ఆరోపించారు. అందులో 25 మంది భారతీయ పౌరులు, ఒకరు నేపాలీ ఉన్నారని తెలిపారు.

ముంబై దాడుల తరువాత అతిపెద్ద దాడి ఇదేనని అన్నారు. కశ్మీర్‌లో శాంతిని భగ్నం చేసేందుకే ఈ కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. అదేవిధంగా కశ్మీర్‌ను కోలుకోకుండా అతలాకుతలం చేసేందుకే ఉగ్రదాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. అక్కడ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని.. పాక్ ప్రయత్నాలను భారత పౌరులు విఫలం చేస్తున్నారని తెలిపారు. TRF అనేది లష్కర్-ఎ-తోయిబాకు ఒక ముసుగు అని ఆరోపించారు. ఉగ్రవాదులకు రక్షణగా ఆ సంస్థ అండగా ఉంటుందని అన్నారు.

TRF‌పై నిషేధం విధించాలని పాక్ ఒత్తిడి చేసిందని.. టీఆర్ఎఫ్, లష్కర్-ఇ-తోయిబా ఒక్కటేనని పేర్కొన్నారు. వాళ్ల కుట్రలను నిఘా వర్గాలు కూడా సేకరించాయని తెలిపారు. ఉగ్రవాదానికి పాక్ స్వర్గధామం అయిందని ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం పాక్ చేస్తుందని ఆక్షేపించారు. ఆపరేషన్ సిందూర్ తరువాత కూడా భారత్‌పై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. అందుకే పాక్ సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని ఆయన సమాధానమిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని తిప్పి కొట్టేందుకు భారత్ తన అధికారాన్ని ఉపయోగించిందని ఇది బాధ్యతాయుతమైన దాడి అని విక్రమ్ మిస్రీ అన్నారు.

Next Story