Operation Sindoor: ప్రధాని నరేంద్రమోడీతో హోంశాఖ కార్యదర్శి భేటీ

by Shamantha N |

నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తో సమావేశమయ్యారు.

Operation Sindoor: ప్రధాని నరేంద్రమోడీతో హోంశాఖ కార్యదర్శి భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తో సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిణామాలను జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోబాల్ ప్రధానమంత్రికి వివరించిన కొద్ది నిమిషాల తర్వాతే ఈ బేటీ జరిగింది. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలోనే సరిహద్దుల్లోని పరిస్థితులను మోడీకి గోవింద్ మోహన్ వివరించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపై ఇరువురు సుదీర్ఘ చర్చ జరిపారు. మరోవైపు, భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఏకపక్షంగా కాల్పులు జరుపుతోంది. ఫిరంగి దాడుల్లో కనీసం 13 మంది పౌరులు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. అయితే, గాయపడిన వారిలో 44 మంది పూంచ్ సెక్టార్ నివాసితులే అని పేర్కొంది.

బుధవారం తెల్లవారుజాము నుంచి కాల్పులు

బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమై మధ్యాహ్నం వరకు అడపాదడపా కొనసాగాయని ప్రత్యక్ష సాక్షులు జాతీయ మీడియాకు తెలిపారు. ఫిరంగి గుండ్లు, తుపాకులు, పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నట్లు తెలిపారు. కొందరు బారాముల్లా వంటి సమీప ప్రాంతాలకు పారిపోగా, మరికొందరు భయంతో ఇళ్లలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అప్పట్నుంచి పాక్ నియంత్రణ రేఖ వెంబడి నిరంతరం రెచ్చగొట్టకుండా కాల్పులు జరుపుతోంది.

Next Story