ఆపరేషన్ సిందూర్ : ప్రధాని మోడీ నిర్ణయానికి డిప్యూటీ సీఎం పవన్ సలాం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-07 11:07:46  IST  )

9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. మూడు ఉగ్రవాద సంస్థలకు చెందినవారిని హతమార్చిందని, ఇది దేశమంతా గర్వించదగిన విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ : ప్రధాని మోడీ నిర్ణయానికి డిప్యూటీ సీఎం పవన్ సలాం
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత ఆర్మీ (Indian Army) నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. మూడు ఉగ్రవాద సంస్థలకు చెందినవారిని హతమార్చిందని, ఇది దేశమంతా గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారిలో ఆంధ్రవాళ్లు కూడా ఉన్నారని, హిందువా, ముస్లిమా అని అడిగి మరీ చంపారని గుర్తు చేశారు. అప్పటి నుంచి దేశమంతా ఒక డెసెసివ్, బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో, ప్రధాని నరేంద్రమోడీ అందరి ఎదురుచూపులకు సమాధానం చెప్పేలా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయించారన్నారు. పాక్ ఆర్మీ, పౌరులపై దాడి చేయకుండా, వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా భారత ఆర్మీ ఎంతో చాకచక్యంగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి.. అందరూ గర్వించేలా చేసిందన్నారు.

కశ్మీర్ మనకు చాలా ముఖ్యం.. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు 90ల్లో కశ్మీర్ కోసం కశ్మీరీ పండిట్లను (Kashmiri Pandits) దారుణంగా చంపేశారన్నారు. ఆ తర్వాత భారత్ లోని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉగ్రమూకలు చేసిన దాడులకు.. ఇప్పుడు జరిగిన ఆర్మీ మెరుపుదాడులే సమాధానమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇండియన్ ఆర్మీ ధైర్య, సాహసాలను మనమంతా మెచ్చుకోవాలని, దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఆర్మీ యుద్ధం చేస్తున్న సమయంలో మనం ఏం చేయగలమో గ్రహించాలని సూచించారు. అలాగే జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు.

కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు అనుకూలంగా ఉన్నవారెవరైనా దేశం వదిలి వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. దానిపై ఎలా స్పందిస్తారని విలేకరులు ప్రశ్నించగా.. తాను కొద్దిరోజుల కిందట కొద్దిమంది కాంగ్రెస్​నాయకులకు మాటలను ఉద్దేశించి మాత్రమే కామెంట్​చేశానని అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలి కానీ.. పాకిస్తాన్‌కు ప్రోత్సాహకరంగా మాట్లాడడం తగదని మరోసారి చెప్పారు. దేశంపై దాడులను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా.. ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ముందుగా బహిరంగంగా ఎందుకు చెప్పలేదని పవన్ ప్రశ్నించారు. భారత దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై డీజీపీతో కూడా మాట్లాడానని ఆయన తెలిపారు. సహనం అనేది ఎల్లకాలం పనిచేయదన్నారు. ఇది బీజేపీ చేస్తున్న యుద్ధం కాదని, దేశం చేస్తున్న యుద్ధమన్న విషయాన్ని అందరూ గ్రహించాలని హితవు పలికారు.

హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉండటంపై పవన్‌ను ప్రశ్నించగా.. వేర్వేరు కారణాలతో చాలామంది రాష్ట్రానికి వస్తుంటారని, వారంతా మైగ్రంట్లని చెప్పుకొచ్చారు. ఏపీ, తెలంగాణ.. రాష్ట్రాలు వేరైనా ఇక్కడి కుల, మతాలు, అక్కడి కుల, మతాలు ఒక్కటేనన్నారు. తెలంగాణ సెపరేషన్ తో నాన్ లోకల్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. గాంధీ మార్గంలో నడవాలి, సహనంతో ఉండాలని చెప్పుకొస్తూ ఉండటం వల్లే దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చామన్నారు.

Read More: భారత సరిహద్దులో ఆపరేషన్ సిందూర్‌‌.. స్పందించిన పవన్

Next Story