ప్రగతిభవన్‌లో ఆపరేషన్ ‘హుజూరాబాద్’

by  |
ప్రగతిభవన్‌లో ఆపరేషన్ ‘హుజూరాబాద్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్ కేంద్రంగా జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌కు చేరుకున్నాయి. పార్టీ వర్గాలే ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఇంతకాలం పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్‌లో హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే మొత్తం రాజకీయాలు తిరుగుతుండడంతో ఇప్పుడు ఆయనే స్వయంగా జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్‌లో సమావేశాలు జరిగితే కొన్ని అంశాలు బైటకు లీక్ అవుతాయనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రగతి భవన్‌ను ఎంచుకున్నట్లు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవుతున్నట్లు మీడియాకు సూచనప్రాయంగా సమాచారం ఇచ్చినా స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొని మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితి, ఇప్పటివరకూ చేసిన ప్రచారం ఎలా ఉన్నది, ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు, ఇకపైన చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, పార్టీ కార్యకర్తలను అక్కడికి తరలించి ప్రతీ ఓటరును కలవడానికి తీసుకోవాల్సిన చర్యలు, సోషల్ మీడియా విస్తృత వినియోగం తదితరాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు పార్టీ నేతల సమాచారం. తొలుత తెలంగాణ భవన్‌లోనే సమావేశం నిర్వహించాలని షెడ్యూలు ఖరారు చేసినా చివరి నిమిషంలో ప్రగతి భవన్‌కు మారింది. కానీ అధికారికంగా మాత్రం సమాచారంతో పాటు ఫొటోలు, వీడియోలు బైటకు పొక్కకుండా పార్టీ వర్గాలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

టీఆర్ఎస్ సభ్యత్వాల డిజిటలైజేషన్, కార్యకర్తలకు జీవిత బీమా పాలసీ, జిల్లా కేంద్రాల్లో పార్టీ భవనాల నిర్మాణాలు తదితర అంశాలను చర్చించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎజెండా ఖరారు చేశారు. ఈ అంశాలపై ఈనెల 14న నిర్వహించిన సమావేశంలో చర్చించుకున్న వివరాలు మీడియాకు పొక్కడంతో ఇప్పుడు వేదికను మార్చాల్సి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

సభ్యత్వాల డిజిటలైజేషన్‌పై…

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీకల్లా పూర్తి కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే రోజున తెలంగాణ భవన్‌లో జీవిత బీమా పాలసీకి సంబంధించి పార్టీ తరఫున ప్రీమియం మొత్తాన్ని చెక్కు రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. సభ్యత్వ నమోదులో నల్లగొండ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండగా సిద్దిపేట ద్వితీయ స్థానంలో నిలిచింది.


Next Story

Most Viewed