ఉన్నత చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్

by  |
jagan
X

దిశ, ఏపీ బ్యూరో: చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఉన్నత చదువులతోనే పేదల తలరాతలు మారుతాయని.. అందుకే ప్రతి పేద విద్యార్థికి చదువు అందేలా పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్‌ను అందజేస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం విద్యాదీవెన పథకం కింద 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి తల్లుల ఖాతాలోకి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తల్లుల ఖాతాల్లో జమ అయిన డబ్బును కాలేజీలకు తప్పనిసరిగా ఫీజుగా కట్టాలని సూచించారు. లేకపోతే నేరుగా కాలేజీలకే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నట్లు తెలిపారు.

వైఎస్ఆర్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్‌ను దెబ్బతీశాయని.. కాలేజీలకు బకాయిలు పెట్టాయని వివరించారు. ఫీజురీయింబర్స్ మెంట్‌ను చెల్లించని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను కాలేజీలు పరీక్షలు రాయనివ్వకుండా చేసిన ఉదంతాలను చూసినట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులకూ మెడిసిన్, డెంటల్ కోర్సుల్లో యాభై శాతం సీట్లను ప్రైవేట్ యూనివర్శిటీలు, కాలేజీల్లో కేటాయించేలా చట్టం చేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

అలాగే ఇతర కోర్సుల్లో 35 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. జీఈఆర్ రేషియో 35.2 శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివే వారికి రూ.5 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సుల స్టూడెంట్లకు రూ.20 వేలు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

Read more: హిళల పట్ల బరితెగిస్తే.. బడితపూజ ఖాయం: అచ్చెన్నాయుడు


Next Story

Most Viewed