రెండేళ్లలో ఒమేగా ఎలక్ట్రిక్ వాహనాలు!

by  |
రెండేళ్లలో ఒమేగా ఎలక్ట్రిక్ వాహనాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే రెండేండ్లలో టూ, ఫోర్ వీలర్, ట్రాక్టర్ సహా పలు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఒమేగా సెకీ సంస్థ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఆంగ్లియన్ ఒమేగా గ్రూపునకు చెందిన ఈ సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 200 డీలర్‌షిప్‌లను కలిగి ఉండాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 200 కోట్లను ప్రారంభ పెట్టుబడిగా కేటాయించినట్టు తెలిపింది. అలాగే, విస్తరణ ప్రణాళికలో భాగంగా మరో రూ. 1000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ‘త్వరలో కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా వరుసగా కొత్త ఉత్పత్తులను తీసుకొస్తామనీ, రానున్న కొన్నేండ్ల పాటు నిరంతరాయంగా కార్యకలాపాలను నిర్వహిస్తాం’ అని ఆంగ్లియన్ ఒమేగా గ్రూప్ ఛైర్మన్ ఉదయ్ నారంగ్ చెప్పారు.

కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టు నిధులను సమకూర్చుకునేందుకు, అవసరమైన మూలధనాన్ని సేకరించెందుకు వివిధ మార్గాలను కంపెనీ అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాలు, కార్గో విభాగాలకు ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. కార్గో, ట్రాక్టర్ వాహనాలను 2021 ముగింపులో లేదంటే 2022 ప్రారంభంలో తీసుకొస్తామని ఒమేగా సెకీ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖర్జీ వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేశామనీ… ఏడాది చివరి నాటికి 20 ఔట్‌లెట్లను తమిళనాడు, కర్ణాటక, కేరళలలో ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నట్టు ముఖర్జీ చెప్పారు.


Next Story