- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో పాక్ భీకర దాడులు.. పిల్లలు సహా 35 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో పాక్ భీకర దాడులకు దిగింది. అర్థరాత్రి జరిపిన ఈ డబుల్ టాప్ దాడుల్లో చిన్నారులు సహా 35 మంది మరణించారు.

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి నెలకొల్పామని గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్.. ఆ దేశ సరిహద్దుల్లో మాత్రం మారణహోమం సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ దళాలు జరిపిన భూతల ఆపరేషన్, డబుల్ టాప్ వైమానిక దాడులు జరిపింది. దీంతో చిన్నారులు సహా 35 మంది మరణించారు. అయితే మరణించిన వారంతా ఉగ్రవాదులని పాక్ చెబుతుండగా.. వారు సామాన్య పౌరులని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (పీఎఎఫ్) జెట్ విమానాలు రాత్రి 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బయలుదేరి, ఆఫ్ఘనిస్తాన్‌లోని 3 జిల్లాలైన పక్తికాలోని గ్యాన్, పక్తియాలోని చమ్కాని, కునార్‌లోని మారావారా పరిధిలోని ఇళ్లు, మసీదులపై దాడులు చేశాయి.
రెండు సార్లు బాంబుల వర్షం..
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పక్తియా ప్రావిన్స్‌లోని చమ్కాని జిల్లాలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి సమయంలో పాకిస్తాన్ దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక వృద్ధుడు, ఒక చిన్నారి మరణించగా, ఇతర కుటుంబ సభ్యులు గాయపడ్డారు. తొలి బాంబు దాడి జరిగిన 25 నిమిషాల తర్వాత, అంటే రాత్రి 12:55 గంటలకు, శిథిలాల కింద చిక్కుకున్న మహిళలు, పిల్లలను రక్షించడానికి గ్రామస్తులు చేరుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ జెట్ విమానాలు మళ్లీ వచ్చి రెండోసారి బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఉద్దేశపూర్వక రెండో దాడి (సైనిక పరిభాషలో డబుల్ ట్యాప్ దాడి) వల్లే మరణాల సంఖ్య వేగంగా 35 దాటింది. 158 కంటే ఎక్కువ మంది క్షతగాత్రులు అయ్యారు.
ఉగ్రదాడులకు ప్రతీకారంగానే : పాక్
గత వారం కరాచీలో పారామిలిటరీ దళాలకు చెందిన 3 గురు సభ్యుల మరణానికి, మరో 4 గురు గాయపడిన ఘటనతో సహా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగానే ఆఫ్ఘనిస్తాన్‌పై ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రవాద ఘటనలకు స్పందనగానే ఈ ఆపరేషన్ ప్రారంభించామని, జమాత్-ఉల్-అహ్రార్, టీటీపీ చీలిక సమూహాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్టు సమాచార శాఖ మంత్రి అతావుల్లా తారార్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ దాడుల్లో 29 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు, పక్తియా, పక్తికా, కునార్‌లలోని 3 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మా భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం లేదు : ఆఫ్ఘన్
ఉగ్రవాదులపై దాడులు చేశామని పాక్ చెబుతుండగా.. అసలు తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం లేదని ఆప్ఘన్ అధికారులు తెలిపారు. ఈ సైనిక చర్యను పిరికిపందల దురాక్రమరణ, బూటకపు చర్యగా తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అభివర్ణించారు. ఈ దాడిలో వృద్ధులు, 4 -9 ఏళ్ల వయస్సు గల పిల్లలతో సహా 35 మందికి పైగా పౌరులు మరణించారని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. 2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన యుద్దం తర్వాత మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జూన్‌లో జరిగిన పాకిస్తాన్ దాడుల్లో 13 మంది మరణించారు. దీంతో అక్టోబర్ నుండి సరిహద్దులు మూసివేశారు. అయితే పాకిస్తాన్ తన భూభాగంపై దాడి చేస్తున్న టీటీపీ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతోంది. పాకిస్తాన్ చర్యల వల్ల గత 9 నెలల్లోనే దాదాపు 570 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని లెక్కలు చెబుతున్నాయి.






