సోయాబీన్‌కు సబ్సిడీ నహీ!

by  |
సోయాబీన్‌కు సబ్సిడీ నహీ!
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఇది పెద్ద షాక్..! నల్లరేగడి భూములకు ఆలవాలమైన ఆదిలాబాద్ జిల్లా రైతాంగం పత్తి పంట‌తో సమానంగా సాగుచేసే సోయాబీన్ పంట ఈ ఏడాది గగనంగా మారనుంది. ప్రభుత్వం రైతులకు అందజేసే సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం.

దిశ, ఆదిలాబాద్: సోయాబీన్ విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీన్ని వ్యవసాయ శాఖ వర్గాలు కొట్టివేయక పోవడం గమనార్హం. వానాకాలం సీజన్ మొదలుకు ముందే ప్రభుత్వం ఏటా సోయాబీన్ విత్తనాల పంపిణీతో పాటు ప్రతి బ్యాగు‌పై సబ్సిడీ కూడా ప్రకటించేది. విత్తనాలతో పాటు మార్గదర్శకాలు జారీ అయ్యేవి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడానికి మరో పది రోజులు మాత్రమే గడువు ఉండగా ఇప్పటివరకు సోయాబీన్ విత్తనాల పై సబ్సిడీకి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఆయా జిల్లాలకు ఇప్పటికే సోయాబీన్ విత్తనాలు చేరుకుంటున్నాయి. వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం కూడా విత్తనాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. కానీ, సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై అధికారులు ఏం చేయాలో అర్థం కాక సతమత మవుతున్నారు. సీనియర్ అధికారి సమాచారం మేరకు ఈ ఏడాది సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎత్తున సాగుచేసే సోయా రైతన్నకు షాక్ లాంటిదే.

ఉమ్మడి జిల్లా రైతాంగానికి తీరని నష్టం
సోయాబీన్ విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయంపై అన్నదాతలో తీవ్ర నిరాశ నింపుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయాబీన్ పంటను ఎక్కువగా సాగుచేస్తారు. మరీ ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతమంతా సోయాబీన్‌పై ఆధారపడి సేద్యం చేస్తుంటారు. పత్తి పంట‌తో సమానంగా సోయాబీన్ సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా‌గా ఉన్నప్పుడు వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 52 మండలాలకు గాను ప్రతి మండలంలో పదివేలకు పైగా సోయాబీన్ విత్తనాలు రైతులు కొనుగోలు చేసేవారు. గతేడాది సోయాబీన్ విత్తనాల బస్తా ధర రూ.1993 ఉండగా ప్రతి బస్తాపై రూ.820లు రైతులకు సబ్సిడీ ఇచ్చే వారు. ఈ లెక్కన రైతులకు సబ్సిడీతో సోయా విత్తనాల బ్యాగు రూ.1173 లకే లభించేది. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేస్తే మొత్తం ధర రూ.1993 తో రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం ఏమేర నష్టపోతున్నదో అర్థమవుతోంది.

అందని మార్గదర్శకాలు
సోయాబీన్ విత్తనాల పంపిణీ విషయంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఎలాంటి మార్గ దర్శకాలు జారీ చేయలేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో విత్తనాలు అమ్మే ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడం కారణంగా ఇక్కడి అధికారులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.



Next Story

Most Viewed