‘పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదన లేదు’

by  |
Nirmala Sitharaman
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తారనే ఊహాగానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. 2017, జులైలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు డజనుకు పైగా కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి ముడి చమురు, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి ఐదు ఉత్పత్తులు జీఎస్టీ పరిధికి దూరంగా ఉంచబడ్డాయి. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు ఆధారపడటమే దీనికి కారణం. అప్పటి నుంచి కేంద్రం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని విధించడం కొనసాగించగా, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వసూలు చేశాయి.

ఈ పన్నులు, ఎక్సైజ్ సుంకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. పన్నులు తగ్గకపోయినా, ప్రపంచ చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో జీఎస్టీ పరిధిలోకి వీటిని తీసుకురావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. దీనిపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్, ప్రస్తుతం జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజవాయువులను తీసుకురావాలనే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటివరకూ ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధి కిందకు తీసుకురావాలని ఎవరూ సిఫార్సు చేయలేదన్నారు. అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉందన్నారు.

Next Story

Most Viewed