నో ఫీజు రీయింబర్స్‌మెంట్.. సర్కారు తీరుతో విద్యార్థుల్లో టెన్షన్

by  |
నో ఫీజు రీయింబర్స్‌మెంట్.. సర్కారు తీరుతో విద్యార్థుల్లో టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2019-20 విద్యాసంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదు. కొవిడ్​పేరుతో ఈ స్కీంకు ప్రభుత్వం ఎగనామం పెడుతున్నది. దీంతో ప్రభుత్వంపై విద్యాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక కోసం రూ. వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్​పథకాన్ని గతంలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో 2019-20, 2020-21 విద్యా సంవ‌త్సరానికి గానూ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో స‌ర్కారు దాదాపు రూ.4 వేల కోట్లు బాకీ పడింది.

దీంతో ఇంటర్ మొదలు ఆపై చదువులు చదివే సుమారు 15 లక్షల మంది విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విద్యార్థుల కోర్సు పూర్తైనా సర్టిఫికెట్స్ ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఇతర కోర్సులకు దూరమవుతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 1,500 కోట్ల నిధుల‌కు సంబంధించిన టోకెన్లు జారీచేసినా కొవిడ్​సాకుతో నిధుల విడుదలను ఆలస్యం చేస్తోంది. మరో వైపు రీయింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారుతోందని, మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విద్యకు దూరం చేయొద్దు..

చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్​షిప్స్ ఇవ్వకుండా మరింత మందిని విద్యకు దూరం చేయొద్దు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న రూ.4 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు.
– అనిల్, విద్యార్థి, సికింద్రాబాద్

భిక్ష కాదు.. హక్కు

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు ప్రభుత్వం వేసే భిక్ష కాదు. అది విద్యార్థుల హక్కు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్​కోసం వేల కోట్లు వెచ్చించిన సర్కార్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు సాకులు చెప్పడం సిగ్గుచేటు.

– జీవన్, ఏబీవీపీ స్టేట్​జాయింట్ సెక్రటరీ.

ఉద్యోగాల భర్తీకి సర్కార్ బ్రేక్.. ఇక సర్ధుబాటే!


Next Story