వరల్డ్ క్లాస్ సిటీలో కారు చీకట్లు..

52

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు మెరుగైన సేవల మాట దేవుడెరుగు కానీ, అత్యవసర సేవలు అందించడంలో విద్యుత్ సంస్థ ఘోరంగా విఫలమైంది. రాష్ట్రం ఇంకా అంధకారంలో విలవిలలాడుతోంది. వర్షాలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రానికి కరెంటు కష్టాలు తీరడం లేదు. విద్యుత్ సంస్థ పరిపాలనా యంత్రాంగం ఉండే ప్రాంతంలోనే రోజులు గడుస్తున్నా కరెంటు సరఫరాను పునరుద్ధరించలేని పరిస్థితిలో ఆ విభాగమున్నదంటే ఆ సంస్థ పనితీరు ఏమేరకు ఉన్నదో విదితమవుతోంది.

రెండు రోజులు గడిచినా విద్యుత్ అత్యవసర సేవలు అందించలేని నిశ్చేష్ఠ స్థితికి ఆ సంస్థ చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనే ఈ దుస్థితి నెలకొన్నదంటే ఇక మారుమూల గ్రామాలు, తండాలు, పట్టణాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గ్రహించవచ్చని పలువురు వేలెత్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నా వినియోగించుకోలేని నిర్లక్ష్యంలో ఆ విభాగం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు వర్షాలు కష్టాలను తెస్తే కరెంటు అందించక విద్యుత్ విభాగం కొత్త కష్టాలను కొనితెచ్చిపెడుతుందని సామాన్య ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు

రోజుల తరబడి అంధకారంలోనే..

దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ భవనం ఉండే సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు మూడు రోజులుగా చీకట్లోనే గడుపుతున్నాయి. సంస్థ పరిధిలోని హైదరాబాద్ మహానగరంలోని చాలా బస్తీలు, శివారు ప్రాంతాల కాలనీలు, జిల్లాల్లో మారుమూల గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. 48 గంటలు దాటుతున్నాఇంకా కరెంటు వస్తుందనే ఆశల్లోనే ప్రజలు బతుకుతున్నారు. కరెంటు సమస్యల్లోనే ఉన్న గ్రామాల పేర్లు చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. అసలే వరదనీరు ఇండ్లలోకి చేరి అవస్థల్లో నివసిస్తుంటే కరెంటు లేక ఇండ్లలో మగ్గుతూ పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వారు గోడును వెల్ల బోసుకుంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 15 సబ్ స్టేషన్లలో నీరు తోడి పనిచేసేలా చేస్తున్నామని ప్రకటించిన ఉన్నతస్థాయి అధికారులు కరెంటు సరఫరా పునరుద్ధరణకు రోజుల తరబడి సమయమెందుకు తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి అని శివారు ప్రాంతవాసులు ఆగ్రహం చెందుతున్నారు. జిల్లాల పరిధిలో సుమారు 63 వరకు సబ్ స్టేషన్లను వెంటనే మరమ్మతులు చేపట్టామని చెప్పిన అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. 686 ఫీడర్లలో 671 వరకు మరమ్మతులు చేశామని చెప్పిన అధికారులు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదనే దానికి వారి నుంచి సమాధానాలు లేకుండా పోయాయని నగర శివారులోని పీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. 189 అత్యవసర బృందాలు ఎక్కడ పనిచేస్తున్నాయని బస్తీల వాసులు ప్రశ్నిస్తున్నారు.

బస్తీలు, గ్రామాలు

ఉత్తర ప్రాంతీయ విద్యుత్ సంస్థ పరిధిలోని గ్రామాలు, తండాల వారు రాత్రి వేళ ఎక్కడ గుంతుందో, రోడ్డుందో, కూలి గొయ్యిపడిందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామాల్లోని, పట్టణాల్లో ఇండ్లలోకి చేరిన నీళ్ళు, తడిసిన సరుకులు, నానిన వస్త్రాలు అత్యవసర పరిస్థితులకు వినియోగించుకునే వస్తువులను వెతుక్కోవడానికి కరెంటు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదంతా విద్యుత్ అధికార యంత్రాంగానికి తెలియంది కాదు. తెలిసినా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 16 ఫీడర్ల పరిధిలోని గ్రామాలు ఇంకా విద్యుత్ సమస్యల్లోనే ఉన్నాయి. 175 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోయిన ప్రాంతాల్లోని పల్లెలు కరెంటు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పట్టణాల్లోని మురికివాడల ప్రజలు రాత్రి వేళ ఇండ్లలోనూ ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పడితే దోమలు, నీటి ద్వారా వచ్చే పురుగు పుట్రా వంటివి బస్తీల వాసులను అవస్థలకు గురిచేస్తున్నాయి.