కుర్చేసుకుని కూర్చుంటానన్న సీఎం ఎక్కడ..?

by Shyam |   (  Updated:2020-11-19 00:42:54  IST  )

<p>ఇస్తాంబుల్​ ఏమోగానీ ఐదేళ్లలో అటుగా వెళ్లిన వారే లేరు.. సీఎం కేసీఆర్​ కుర్చేసుకొని కూర్చుంటనన్నాడు.. పనులు ఎట్లాకావో, ఎందుకు కావో చూస్తానన్నాడు.. పెద్దాయన తల్చుకుంటే తమకేం ఢోకా లేదు, జీవితాలు మారుతాయి, బతుకులు బాగుపడుతాయ్ అనుకున్నారు పార్శిగుట్టవాసులు.. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది.. టీఆర్​ఎస్​ పదవీ కాలం ముగిసింది.. కానీ సీఎం ఇచ్చిన హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు.. రోడ్ల పరిస్థితి అంతంతే.., డబుల్​ బెడ్రూం పనులు కదలలేదు.., నాలా పనులు షురవే కాలేదు. వెక్కిరిస్తున్న [&hellip;]</p>

కుర్చేసుకుని కూర్చుంటానన్న సీఎం ఎక్కడ..?
X

ఇస్తాంబుల్​ ఏమోగానీ ఐదేళ్లలో అటుగా వెళ్లిన వారే లేరు.. సీఎం కేసీఆర్​ కుర్చేసుకొని కూర్చుంటనన్నాడు.. పనులు ఎట్లాకావో, ఎందుకు కావో చూస్తానన్నాడు.. పెద్దాయన తల్చుకుంటే తమకేం ఢోకా లేదు, జీవితాలు మారుతాయి, బతుకులు బాగుపడుతాయ్ అనుకున్నారు పార్శిగుట్టవాసులు.. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది.. టీఆర్​ఎస్​ పదవీ కాలం ముగిసింది.. కానీ సీఎం ఇచ్చిన హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు.. రోడ్ల పరిస్థితి అంతంతే.., డబుల్​ బెడ్రూం పనులు కదలలేదు.., నాలా పనులు షురవే కాలేదు. వెక్కిరిస్తున్న పనులు, వెగటు పుట్టిస్తున్న నాయకులు తీరు.

దిశ, తెలంగాణ బ్యూరో : “వచ్చే ఎన్నికల్లో గెలుస్తమో.. ఓడుతమో..? తెల్వది. ఈ నాలుగేళ్లలో మార్పు తీసుకొస్తా. మనకు రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంది. ప్రభుత్వం దగ్గర బోలెడు డబ్బుంది. ఒక్కో నియోజకవర్గానికి రూ.200-300 కోట్లు ఇస్తా. ఇక్కడి బస్తీల్లో పరిస్థితి గోరటి వెంకన్న పాట ‘గల్లీ చిన్నది..’ లెక్కనే ఉంది. ఈ పరిస్థితులపై యుద్ధం చేద్దామా..? ఓడిపోదామా..? మీరు ముందుకు వస్తే వంద శాతం నేను మీ వెంట ఉంటా. అమెరికా, లండన్‌ ఎట్ల అభివృద్ధి చెందినయి. వాడేమన్నా బంగారం తింటడా..? వాడికి దమాక్‌ ఉంది..? మనకు లేదు. ఇక్కడ అభివృద్ధికి ఆస్తుల సేకరణ అవసరమైతది. ప్రజలను కన్వీన్స్‌ చేయండి. ఇండ్లు పోయినా.. మళ్లీ కట్టిస్తరని చెప్పండి. ఆరు నెలల్లో ఎట్లుండె.. ఎట్లయిపోయింది.? అనుకునేట్టు చేస్తా. మీ బస్తీని అందంగా తీర్చిదిద్దుతా. నాలాల మీదనే బంగ్లాలు కట్టిండ్రు. వాటికి ఎట్లా అనుమతిచ్చిండ్రో తెల్వది. మన నాలాను మనమే ఆక్రమిస్తే… సీఎం ఏం చేయాలె..? అధికారులు ఏం చేస్తరు?’’ 2015 మే 15న ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో భాగంగా సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని పార్శిగుట్టలో సీఎం కే చంద్రశేఖర్ రావు అన్న మాటలివి..

2016 బల్దియా ఎన్నికలు పూర్తయ్యాయి. మేయర్ పీఠం టీఆర్ఎస్ కే దక్కింది. మళ్లీ బల్దియా ఎన్నికలు వచ్చేశాయి. కానీ పార్శిగుట్టలో మార్పులేమైనా వచ్చాయా అని స్థానికులను అడిగితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు సీఎం ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బస్తీల్లో పర్యటించిన తొలి వ్యక్తిగా అందరూ ఆదరించారు. ఇక తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశ పడ్డారు. కానీ ఎందుకో కేసీఆర్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి బల్దియా ఎన్నికల్లోనూ ఇవే హామీలను చెబుతూ ఓట్లు వేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. మేయర్ పీఠంపై టీఆర్ఎస్ వ్యక్తి కూర్చోకపోతే సీఎం చెప్పిన పనులు పూర్తి కావంటూ స్థానిక నాయకులు ప్రచారం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలన్నా, నాలాల విస్తరణ జరగాలన్నా, రోడ్ల విస్తరణ పూర్తి చేయాలన్నా అధికారం తప్పనిసరి అంటూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. దాంతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ హామీలను పూర్తి చేసేందుకు స్థానిక నాయకులు, అధికారులు ప్రయత్నం కూడా చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ చేయాలనుకున్నా స్థానిక నేతలే శ్రద్ధ పెట్టలేదేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే.. అట్లనే పరిస్థితి..

చిలకలగూడ భవానీ నగర్ నుంచి అంబర్ నగర్ వరకు ఉన్న నాలా వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లను ముంచేస్తుంది. చిలకలగూడ, భవానీనగర్, అన్నానగర్, ఉప్పరిబస్తీ, శ్రీనివాస్ నగర్, షాబాద్ గూడ, పుల్లయ్యబావి, నారాయణనగర్, అల్లాడి రాజ్ కుమార్ నగర్, అంబర్ నగర్, ఈశ్వరీబాయినగర్ ప్రాంతాలన్నీ జలమయం. మొన్నటి వర్షాలకూ అదే దుస్థితి. సీఎం కేసీఆర్ ప్రత్యక్ష్యంగా వచ్చి చూసినా ఏ అధికారి పరిష్కారానికి చర్యలు చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి.

డ్రైనేజీ అస్తవ్యస్తం..

ఇప్పటికీ పార్శిగుట్టలో డ్రైనేజీ అస్తవ్యస్తం. చిన్నపాటి వర్షమొచ్చినా నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. చాలా కాలనీల్లో డ్రైనేజీ మురుగుతో సహజీవనం చేస్తున్నారు. రోడ్లు అస్తవ్యస్తమే. కొన్ని ప్రధాన రహదార్లలో మాత్రం డాంబర్ రోడ్లు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ హామీలు..
* పెద్ద పెద్ద రోడ్లు.. తాగునీరు, డ్రైనేజీకి వేర్వేరు పైపులైన్లు, డక్ట్‌లు రావాలి.
* స్థలాలు, ఇండ్లు కోల్పోయే వారికి రెట్టింపు పరిహారం కల్పిస్తాం. ముందే పరిహారం చెల్లించి నష్టపోయిన వారికి ఐడీహెచ్‌ తరహాలో ఇల్లు కట్టిస్తాం. వీలైతే జాగాలు కూడా ఇస్తాం.
* దశల వారీగా 10 వేల ఇండ్లు కట్టిస్తాం.
* ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలను కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు కట్టిస్తాం.
* అక్కడ స్థలం దొరకకపోతే ఉప్పల్‌ చౌరస్తా దగ్గర సీసీఎంబీ, రైల్వేకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టిస్తా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లవలసి ఉంటుంది.
* వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే ఇళ్లు కట్టిస్తాం.
* పార్శిగుట్ట అభివృద్ధికి రూ.200 కోట్లయినా ఇస్తా. పైసలు సమస్య కాదు.
* బస్తీలో జబ్బు వచ్చినోళ్లు ఉంటే 100 శాతం ప్రభుత్వపరంగా వైద్యం చేయిస్తం.
* సికింద్రాబాద్ నియోజకవర్గంలో 70-80 ఫీట్లు రోడ్లు వేయించుకుంటే అన్నీ సమస్యలు పరిష్కారం అవుతాయి.

వీటిలో ఏ ఒక్క పని మొదలు పెట్టలేదని పార్శిగుట్టవాసులు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ సదాశయంతో హామీలిచ్చినా స్థానిక నాయకులు శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఏ హామీ నెరవేరకుండా పోయిందంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ ను కలిసి గుర్తు చేసి ఉంటే ఇప్పటికే అన్నీ పూర్తయి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ ఎన్నికల్లోనూ అవే సమస్యలు ప్రచారాస్త్రాలుగా మారాయి.

తొంగి చూడలే : వల్లారపు శ్రీనివాస్ కుమార్, పార్శిగుట్ట
సీఎం కేసీఆర్ మా పార్శిగుట్టను ఇస్తాంబుల్ చేస్తమన్నరు. ఇక మా ప్రాంతం సుందరంగా మారుతుందనుకున్నం. నాలాలు క్లీన్ చేయలే, పూడికతీత చేపట్టలే, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఓట్లేస్తేనే ఇవన్నీ అయితవన్నారు. ఐనా కాలేదు. మోడల్ సిటీ మాట లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలే మిగిలినయి. అరచేతిలో స్వర్గం చూపించారు. మళ్లీ సీఎం కేసీఆర్ తిరిగి చూడలేదు.

ఒక్క హామీ నెరవేర్చలే : మేకల కీర్తి హర్షకుమార్, పార్శిగుట్ట
సీఎం వచ్చినప్పుడు మా ప్రాంత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశ పడ్డం. ప్రతి నెలా 17వ తేదీన పార్శిగుట్టకు వస్తనన్నారు. దత్తత తీసుకున్నారు. ఆయనే పర్యవేక్షిస్తా అన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేయిస్తా అన్నారు. ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేరలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదు. పార్శిగుట్ట అప్పుడెట్ల ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది. మౌలిక సదుపాయాలే లేవు. బస్తీ దవాఖానాలే లేవు. వర్షం వస్తే 50 శాతం ఇండ్లు ముంపులోనే. కనీసం నాలాల పూడికతీత కూడా చేపట్టలేదు.

రూ.10 వేలు కూడా రాలే : రాజు, పార్శిగుట్ట
మేం ఏం చెప్పడానికి లేదు. మీడియాకు అంతా తెలుసు. అప్పుడేం ఉన్నయ్. ఇప్పుడేం అయినయ్. అన్నీ తెలుసు. కళ్ల ముందే ఉన్నయ్. అభివృద్ధి లేదు. కొన్ని ప్రధాన ప్రాంతాల్లో డాంబరు రోడ్లు మాత్రం వేశారు. ఇక్కడికి వస్తే జనం ఏం అనుకుంటున్నరో తెలుస్తుంది. సీఎం కేసీఆర్ వచ్చారు. పోయారు.. అంతే తప్ప.. ఏ పనీ కాలేదు.

Next Story