‘రాహుల్.. మన్మోహన్‌ను అడిగి తెలుసుకో’

by  |
‘రాహుల్.. మన్మోహన్‌ను అడిగి తెలుసుకో’
X

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణం ఎగవేసిన వారిలో బీజేపీ స్నేహితులే ఎక్కువగా ఉన్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మొండి బకాయిల రైటాఫ్ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రాహుల్ అడిగి తెలుసుకోవాలని చురకలంటించారు. తమ అసత్య వాదనలతో కాంగ్రెస్ నాయకులు రాహుల్, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జెవాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ నిర్దేశించిన నాలుగేండ్ల ప్రొవిజనింగ్ సైకిల్ ప్రకారం.. మొండి బకాయిలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. పూర్తి కేటాయింపుల అనంతరం, బ్యాంకులు నిరర్ధక ఆస్థులను రైటాఫ్ చేస్తాయని పేర్కొన్నారు. కానీ బ్యాంకులు మాత్రం రుణ గ్రహీతల నుంచి రికవరీని కొనసాగిస్తాయని తెలిపారు. అది రుణం మాఫీ చేయడం కాదని స్పష్టం చేశారు. అలాగే, విజయ్ మ్యాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలను సంబంధించి ఇప్పటివరకు రూ.18,332 కోట్ల ఆస్తులను జప్తు చేశామని పేర్కొన్నారు. కాగా, ఓ ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుకు స్పందనగా పెద్ద ఎత్తున బ్యాంకు కుంభకోణాలకు పాల్పడ్డ 50మంది రుణ ఎగవేతదార్ల జాబితాను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags: nirmala sitharaman, finance minister, RBI, modi, rahul gandhi, bjp, congress, randeep surjewala


Next Story