కొత్త కలెక్టరేటుపై కిరికిరి.. హైకోర్టులో పిల్

by  |
Nirmal new collectorate
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కొత్త కలెక్టరేట్ భూములపై సరికొత్త వివాదం నెలకొన్నది. కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేసే ప్రాంతం మాస్టర్ ప్లానులో గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుందని ఇప్పటికే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో తక్షణమే పనులు నిలిపేయాలనే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు చేస్తున్నారంటూ బీజేపీ ఆందోళన బాట పట్టింది.. ఇప్పటికే కలెక్టరుకు వినతి పత్రం అందజేయగా.. పనులు ఆపకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పేర్కొంటున్నారు. కొత్త కలెక్టరేటును రూ.50కోట్లతో నిర్మిస్తుండగా.. ఇప్పటికే రూ.14కోట్లు వెచ్చించారు. తాజాగా వివాదం హైకోర్టుకు చేరటంతో.. కలెక్టరేట్ నిర్మాణంపై సందిగ్ధంలో పడింది.

2015 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజనలో భాగంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయగా.. కొత్త జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆర్డీవో కార్యాలయంలో కలెక్టరేటును నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనాలు లేకపోవటంతో.. అందులోనే కొనసాగిస్తున్నారు. కొత్తగా నిర్మల్ సమీపంలోని ఎల్లపల్లి శివారులో కలెక్టరేటు భవన సముదాయం నిర్మిస్తున్నారు. సుమారు 25ఎకరాల్లో నిర్మించాలని భావించగా.. పక్కనే కొచ్చెరువు ఉండటంతో కొంత భూమి ఎఫ్టీఎల్ పరిధిలోకి రావటంతో పది ఎకరాలను తీసేశారు. దీంతో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణం చేస్తున్నారు. ఇందుకోసం రూ.50కోట్ల అంచనా వ్యయంగా ఉంది. నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకోగా.. 2018 నుంచి నిర్మాన పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఆదేశాలు బేఖాతరు..

కొత్త కలెక్టరేటు నిర్మించే భూములపై తాజాగా సరికొత్త వివాదం నెలకొన్నది. నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లానులో ఈ భూములు గ్రీన్ జోన్ పరిధిలో వస్తుందని ఇటీవల కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం కొత్త కలెక్టరేట్ నిర్మిస్తున్న సర్వే నంబర్ 422.. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ సర్వే నెంబరు గ్రీన్ జోన్ పరిధిలో ఉండటంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఈ సర్వే నంబరులో పార్కులు, ఆటస్థలాలు మాత్రమే ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉంటుందని.. గ్రీన్ జోనులో ఎలాంటి నిర్మాణాలు, భవనాల పనులు చేపట్ట వద్దని.. ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు చేయవద్దని పిల్ దాఖలు చేశారు. ఈ స్థలంలో తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

భూముల డిమాండ్ పెంచుకునేందుకే…

కొచ్చెరువు సమీపంలోని సర్వే నంబర్ 422లో పనులు నిలిపి వేయాలని.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఇటీవల బీజేపీ నాయకులు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి వినతి పత్రం అందజేశారు. ఈ కలెక్టరేట్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని. పక్కనే ఉన్నవందలాది ఎకరాల భూములకు డిమాండ్ పెంచుకునేందుకు నిర్మిస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. గ్రీన్ జోన్ పరిధిలో నిర్మాణాలు నిలిపేయటంతో పాటు.. రిజిస్ట్రేషన్లు కూడా చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని.. నిర్మాణ పనులు ఆపివేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులను అడ్డుకుంటామని చెబుతున్నారు. త్వరలో కలెక్టర్ కార్యాలయాన్నిముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. డిసెంబరులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతుండగా.. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Next Story

Most Viewed