నిర్భయ దోషుల అంతిమ ఘడియలు..

by  |
నిర్భయ దోషుల అంతిమ ఘడియలు..
X

దిశ, వెబ్‌డెస్క్: సుమారు ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలైంది. షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 5.30కు నలుగురు దోషులు ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను తీహార్ జైలులో అధికారులు ఉరితీశారు. మరణశిక్షను రద్దు చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఈ నలుగురు దోషులు వారి చివరి క్షణాల్లో అసాధారణంగా ప్రవర్తించారు. ఉరిశిక్ష అమలుకు రోజు ముందు నుంచే విచిత్రంగా వ్యవహరించినట్టు జైలు అధికారవర్గాలు తెలిపాయి.

ఉరిశిక్ష అమలుకు ముందు రోజు(గురువారం) రాత్రి.. వినయ్, ముఖేష్‌లు సమయానికి ఆహారం తిన్నారు. అక్షయ్ కేవలం టీ తాగారు. ముఖేష్.. అవయవదానం చేయాలని భావించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. తన అవయవాలను దానం చేయాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్టు వివరించాయి. రాత్రి ఒంటి గంటకు అక్షయ్.. ముఖేష్‌ను కలవాలని అడిగాడు. కానీ, హెడ్ వార్డెన్ అందుకు నిరాకరించాడు. అప్పుడే అటుగా వెళ్లుతున్న తలారీని అక్షయ్ చూసినట్టు తెలిసింది. ఆ కొత్త ముఖం ఎవరో తెలుసుకోవాలని అక్షయ్ ఆసక్తి కనబరిచాడు. కానీ, అతను కూడా జైలు సిబ్బందేనని వార్డెన్.. అక్షయ్‌కు తెలిపారు.

కోర్టు వివరాలన్నీ అధికారులు.. ఎప్పటికప్పుడు దోషులకు తెలియజేశారు. గురువారం రాత్రి త్వరగా నిద్రపోవాలని సూచించారు. కానీ, మరణానికి సంబంధించిన టెన్షన్‌తో ఆ నలుగురు రాత్రంగా మెలుకువతోనే ఉన్నట్టు తెలిసింది. వినయ్ రాత్రంతా తన సెల్‌లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించాడు. ఉదయం నాలుగు గంటలకు వారిని స్నానమాచరించేందుకు అధికారులు పురమాయించారు. కానీ, వారు నిరాసక్తత ప్రదర్శించారు. ఉదయం 4.15 నిమిషాలకు ప్రార్థన చేసుకునేందుకు సమయమిచ్చినా.. వారు ప్రార్థించుకోలేదు. అల్పాహారాన్నీ తినలేదు. నాలుగున్నరకు వారికి మెడికల్ చెకప్ చేశారు.

5.20 నిమిషాలకు నలుగురి ముఖాలను వస్త్రంతో కప్పి చేతులను వెనక్కి కట్టేశారు. ఉరి కంభం వైపుగా తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇతర ఖైదీలు బయట లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచిన తలారీ పవన్ జల్లాద్ ఉరి కంభాన్ని పరిశీలించారు. ఉరి వేసే ప్రదేశానికి తీసుకెళ్లి చివరి కోరిక ఏమిటని అడగ్గా నలుగురూ మౌనంగానే ఉండిపోయారు. ఎవరైనా మతగురువుల సమక్షంలో ఉరి తీయాలా? అని ప్రశ్నించగా.. వారు తిరస్కరించారు.

తలారి పవన్ జల్లాద్.. నలుగురిని ఉరి తీశారు. అరగంట సేపు ఉరికొయ్యకే ఉంచారు. ఆ నలుగురూ మరణించారని వైద్యుడు ధృవీకరించాక మృతదేహాలను ఉరికంభం నుంచి తొలగించి పోస్ట్‌మార్టంకు తరలించారు. దేశ చరిత్రలో నలుగురినీ ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి.

tags : nirbhaya convicts, hang, tihar jail, for, death, last wish, last moments



Next Story

Most Viewed