బాలికలపై అనాగరిక చర్యలు.. ఆపకుంటే ఆపదే!

by  |
బాలికలపై అనాగరిక చర్యలు.. ఆపకుంటే ఆపదే!
X

దిశ,ఫీచర్స్ :ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలు శారీరకంగా, మానసికంగా హింసించబడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఇది వారి కుటుంబాలు, స్నేహితులు, కమ్యూనిటీల సమ్మతితోనే జరుగుతోంది. ఆడపిల్లలపై కొనసాగుతున్న దోపిడీ వివిధ రూపాల్లో ఉంటుండగా.. ఈ సంఘటనల్లోనూ ‘మానవ హక్కుల ఉల్లంఘన’ కామన్ పాయింట్‌గా కనిపిస్తుండటం ఆలోచించాల్సిన విషయం. ఈ అనాగరిక చర్యలు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడుతుండగా.. ఇందులో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని హానికర పద్ధతులు ఉండటం కలవరపెట్టే అంశం. మరోవైపు జాతీయ చట్టాలు ఈ పద్ధతులపై నిషేధం విధించినప్పటికీ, మానవ హక్కుల ఉల్లంఘనలు నేటికీ కొనసాగుతున్నాయనేది స్పష్టం. ఈ నేపథ్యంలోనే వాటిని అంతం చేసేందుకు ప్రభుత్వాలు, సంఘాలు, వ్యక్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే వాదనలు వినబడుతున్నాయి.

20 ఏళ్లలోపు వయసున్న దాదాపు 120 మిలియన్ బాలికలు (పదిలో ఒకవంతు) సెక్స్‌ లేదా ఇతర లైంగిక చర్యల్లో పాల్గొనేలా బలవంతం చేయబడ్డారు. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని యూనిసెఫ్ లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా బాల్య వివాహం, లింగ-ఆధారిత లైంగిక ఎంపిక, స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనం వంటి అనేక ఇతర పద్ధతులు.. చూసేందుకు సాధారణంగా, ప్రయోజనకరమైనవి అనే ముసుగులో కనిపిస్తూ బాలికల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయి. కాగా ఇటువంటి పద్ధతులను ముందుగానే గుర్తించి అరికట్టాల్సిన అవసరం ఉంది.

హానికరమైన పద్ధతులను గుర్తించడం..

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) ప్రకారం.. బ్రెస్ట్ ఫ్లాటెనింగ్ నుంచి కుమారులకు అనుకూలంగా ఉండటం వరకు ఇంచుమించు 19 హానికరమైన పద్ధతులు ఉన్నాయి. అవి మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడతాయి.

• మంత్రవిద్య ఆరోపణలు
• బైండింగ్, బ్రాండింగ్, మచ్చలు లేదా గిరిజన గుర్తులు విధించుట
• పెదవి డిస్క్‌లు, మెడ పొడిగింపు వంటి శరీర మార్పులు
• బ్రెస్ట్ ఐరనింగ్
• వధువుకు వెల కట్టడం, వరకట్నం-సంబంధిత హింస
• బాల్య వివాహం
• శారీరక దండన
• బాలికలకు చాలా తక్కువ లేదా ఎక్కువ ఆహారాన్ని అందించడం
• రాళ్లు వేయడం(స్టోనింగ్)
• మహిళల సంతానోత్పత్తిని నియంత్రించే నిషేధాలు లేదా చర్యలు
• హింసాత్మక కఠిన ఆచారాలు
• కన్యత్వ పరీక్ష
• వైధవ్య పద్ధతులు
• గౌరవం పేరుతో చేసే నేరాలు
• స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనం
• లింగ-పక్షపాత లైంగిక ఎంపిక
• సంభోగం
• శిశుహత్య
• పోషకాహార నిషేధాలు, సాంప్రదాయ జనన పద్ధతులు

స్త్రీ జననేంద్రియ విచ్ఛేదనం (Female genital mutilation)

సాధారణంగా ఐదు నుంచి పదిహేనేళ్ల మధ్య వయసు గల అమ్మాయిల విషయంలో ఈ పద్ధతిని పాటిస్తారు. ఇప్పటికే FGM(Female genital mutilation) ప్రబలంగా ఉన్న ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా ఖండాల్లోని 30 దేశాల్లో సుమారు 200 మిలియన్లకు పైగా బాలికలు, మహిళల జననేంద్రియాలు కత్తిరించబడ్డాయి. బాలికలకు సంబంధించి ఇది ఒకరంగా మానవ హక్కుల ఉల్లంఘనే. కాగా ఇలాంటి హానికరమైన పద్ధతులు బాలికల ఆత్మ గౌరవాన్నే కాక వారి శారీరక, మానసిక & సామాజిక అభివృద్ధిని.. విద్య, ఆరోగ్యంతో పాటు ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి శారీరక గాయం కంటే మానసికంగా లేదా భావోద్వేగపరంగా కలిగే బాధే ఎక్కువ. అయితే ఈ రకమైన హానిని లెక్కించవచ్చు గానీ బాల్య వివాహం లేదా కొడుకు ప్రాధాన్యతినివ్వడం వల్ల కలిగే హానిని లెక్కించలేం.

మహిళలపై ఫోర్త్ వరల్డ్ కాన్ఫరెన్స్(1995)

1995 బీజింగ్‌లో మహిళలపై నిర్వహించిన ఫోర్త్ వరల్డ్ కాన్ఫరెన్స్.. లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్త ఎజెండాలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా 189 దేశాలు మహిళా సాధికారత ఎజెండాపై బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్‌ఫామ్‌ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇది లింగ సమానత్వంపై అత్యంత ముఖ్యమైన ప్రపంచ విధాన ప్రకటనగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఇది మహిళా పురోగతి, లింగ సమానత్వం సాధించేందుకు వ్యూహాత్మక లక్ష్యాలు, కార్యక్రమాలను నిర్దేశిస్తుంది. కాగా బాలికల హక్కుల్ని గౌరవించడానికి, ప్రపంచవ్యాప్తంగా వారు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యల గురించి అవగాహన కల్పించడానికి అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటిస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.. 19 డిసెంబర్, 2011న 66/170 తీర్మానాన్ని ఆమోదించింది.

లింగ సమానత్వం ఎందుకు అవసరం?

సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా, దాని 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(SDGs).. 2015లో ప్రపంచ నాయకులచే ఆమోదించబడ్డాయి. ఇవి సుస్థిరమైన పురోగతికి బ్లూప్రింట్‌ వంటివి. పేదరికం, అసమానత, వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత, శాంతి & న్యాయం వంటి ప్రపంచవ్యాప్త సమస్యలను అడ్రస్ చేయగలవు. మొత్తం 17 లక్ష్యాలకు లింగ సమానత్వం, మహిళా సాధికారత ప్రధానమైనవి. ఈ లక్ష్యాలన్నింటిలో మహిళలు, బాలికల హక్కులను కాపాడటం ద్వారా మాత్రమే న్యాయం, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రస్తుత, భవిష్యత్తు తరాల కోసం దీర్ఘకాలిక పర్యావరణ సుస్థిరతను సాధించగలం.

స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడానికి మహిళలు, బాలికలను శక్తివంతం చేయడంతో పాటు లింగ సమానత్వాన్ని పెంపొందించడం అవసరం. మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్షలను అంతం చేయడం అనేది ప్రాథమిక మానవ హక్కు. ఇది ఇతర అభివృద్ధి రంగాల్లో గుణాత్మక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. నేడు కౌమారదశలో ఉన్న బాలికల శక్తిపై పెట్టుబడి పెట్టడం వారి హక్కులను కాపాడుతుంది. మరింత న్యాయమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. దీనిలో వాతావరణ మార్పు, రాజకీయ సంఘర్షణ, ఆర్థిక వృద్ధి, అనారోగ్య నివారణతో పాటు ప్రపంచ సుస్థిరత సమస్యలను పరిష్కరించడంలో మానవాళిలో సగం మంది సమాన భాగస్వాములే.

Next Story

Most Viewed