ఆ మూడు రాష్ట్రాల్లో కొత్త స్ట్రెయిన్‌లు.. సర్వత్రా ఆందోళన

by  |
ఆ మూడు రాష్ట్రాల్లో కొత్త స్ట్రెయిన్‌లు.. సర్వత్రా ఆందోళన
X

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా వ్యాపించే కరోనావైరస్ కొత్త వేరియంట్లు ప్రవేశించడం, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ సహా పలురాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వీటికితోడు దేశీయంగానూ వేలాది వేరియంట్లున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఎన్440కే, ఈ484కే వేరియంట్లపై నోరువిప్పింది. ఈ వేరియంట్లు మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో వ్యాప్తిలో ఉన్నట్టు వెల్లడించింది. అయితే, మ్యుటేషన్లపై ఇంకా సమగ్ర పరిశోధనలు చేయాల్సి ఉన్నదని తెలిపింది. వీటితోపాటు యూకే స్ట్రెయిన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లూ దేశంలో ఉన్నట్టు తెలిపింది.

అలాగే, దేశంలో మళ్లీ ఉధృతమవుతున్న కరోనా కేసులకు ఈ వేరియంట్లకు సంబంధం లేదని, కొత్త వేరియంట్ల వల్లే కేసులు పెరుగుతున్నాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవని వివరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో రెండు వేరియంట్ల గురించి విస్తృతంగా చర్చ నడుస్తున్నదని, ఎన్440కే, ఈ484కే వైరస్‌లు మహారాష్ట్రలో ఉన్నమాట వాస్తవమేనని, కేరళ, తెలంగాణలోనూ ఈ వేరియంట్లను గుర్తించినట్టు తెలిపారు. కొత్త వేరియంట్లను మనదేశంలో గుర్తించామని, కానీ, వాటి తీరుపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉన్నదని అన్నారు. వాటి వ్యాప్తి సామర్థ్యం, వ్యాధి తీరు, క్లినికల్ ఇన్ఫర్మేషన్‌లు ఇంకా అందుబాటులో లేవని వివరించారు. మ్యూటేషన్ల బిహేవియర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపు 3,500 స్ట్రెయిన్‌లను సీక్వెన్స్ చేసినట్టు వెల్లడించారు. ఈ మ్యూటేషన్లు అసాధారణంగా ప్రవర్తిస్తున్నాయా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జీనోమిక్ కన్సార్టియం నిపుణుల విశ్లేషణలతో అర్థమయ్యేదేమంటే, కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణం కాదని తెలుస్తుందన్నారు. కానీ, ఈ విశ్లేషణలు, పరిశోధనలు ఇంకా పురోగతి సాధించాల్సి ఉన్నదని వివరించారు. వైరస్ వేరియంట్లను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు సుమారు ఆరువేల నమూనాలపై చేపట్టినట్టు సమాచారం.

187 మందికి యూకే వేరియంట్

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, దేశంలో 187 మందిలో యూకే కరోనావైరస్ వేరియంట్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ ఆరుగురిలో, ఒకరిలో బ్రెజిల్ వేరియంట్‌ను గుర్తించినట్టు తెలిపారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు వేగంగా తగ్గుతున్నదని, ప్రస్తుతం 5.19 శాతంగా ఉన్నదని వివరించారు. కేరళ, మహారష్ట్రల్లోనే 75శాతం యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొన్నారు. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 38శాతం కేరళలో 37 శాతం మహారాష్ట్రలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికి పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లి కరోనా పరిస్థితులను సమీక్షించాయని, ఇకపైనా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లకు త్వరలోనే వెళ్తాయని వివరించారు. మంగళవారానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కి చేరాయి. కాగా, సుమారు 1.17 కోట్ల మందికి టీకా వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ వెల్లడించారు.

Next Story

Most Viewed