ఆస్తమా, సైనసైటిస్ రోగుల అష్టకష్టాలు

by  |
ఆస్తమా, సైనసైటిస్ రోగుల అష్టకష్టాలు
X

జలుబు, దగ్గు, తుమ్ములు, శ్వాసలో ఇబ్బందులు.. ఇవి నాలుగు ఆస్తమా, సైనసైటిస్ పేషెంట్లకు బెస్ట్ ఫ్రెండ్స్. తొలకరి జల్లు పడగానే రైతులు విత్తనాలు వేసినట్లు, వానచినుకు పడగానే వీరి ముక్కుల్లో చినుకు పుడుతుంది, తలలో నొప్పి పుడుతుంది, కళ్లలో ఎరుపు పుడుతుంది. తుమ్మి తుమ్మి కళ్లు వాచిపోతాయి. కర్చీఫ్‌లు, టిష్యూలు లేకుండా వీరికి రోజు గడవదు. ముక్కు నుంచి కారుతున్న చీమిడిని తుడుచుకోవడానికి రోజులో 4 గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ట్యాబ్లెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంటీబయాటిక్‌లు, జలుబు, తుమ్ముల మందులతో చిన్నపాటి మెడికల్ షాపును తలపిస్తాయి. ప్రతి వానాకాలం, చలికాలంలో ఆస్తమా, సైనసైటిస్ పేషెంట్లు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఇబ్బందులను పడి పడి వారికి అలవాటైంది. కానీ ఈ ఏడాది అలా కాదు. అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలు కూడా ప్రారంభమవుతున్నాయి.

అవును.. ఆస్తమా, సైనసైటిస్ రోగులు ఒకప్పుడు తుమ్మినా, దగ్గినా.. ఆ జబ్బే అంత! అనుకుంటూ అడ్జస్ట్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక్క తుమ్ము తుమ్మినా కరోనా అంటున్నారు. దీంతో వారిలో ఆత్మన్యూనతా భావం కలుగుతోంది. తుమ్మును ఆపడం ప్రమాదకరమని తెలిసినా బలవంతంగా ఆపుకోవాల్సి వస్తుంది. గట్టిగా ముక్కులో శ్లేష్మాన్ని మొత్తం టిష్యూలో ఊదేసి బయటపడేసే స్వేచ్ఛ కూడా ఇప్పుడు లేదు. మామూలుగా ముక్కు చీదినా నలుగురు అనుమానంతో చూస్తున్నారు. తలలో కలిగే నొప్పి కంటే ఆ చూపుల కారణంగా మనసుకు గుచ్చుకుంటున్న నొప్పి వర్ణనాతీతం. రాత్రిపూట ఆయాసంతో నిద్రపట్టక, తెల్లవారుజామున ఉబ్బిన కళ్లతో బయటికి వచ్చినా కూడా కరోనా వైరస్ కారణమని పుకారు లేపుతున్నారు. అన్‌లాక్ ప్రారంభమై అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా వీరికి బయటికి వెళ్లాలంటే భయం పుడుతోంది.

మాస్కు ధరించి బయటికి వచ్చినా… తుమ్మిన తుమ్ములకు మాస్క్ అంతా తడిగా మారుతోంది. దీంతో రెండింతల రక్షణ కోసం ముందు కర్చీఫ్ కట్టి, దాని మీదుగా మాస్క్ ధరించాల్సి వస్తోంది. నిరంతరం గంగా నదిలాగా పొంగే ముక్కును మాటిమాటికి మాస్క్ తీసి తుడుచుకోవడంతోనే రోజులు గడిచిపోతున్నాయి. తుమ్ము, దగ్గు, జలుబు కారణంగా నోట్లో రుచి చూసే జ్ఞానం తగ్గిపోతుంది. సాధారణ రోజుల్లో ఇది కామనే. కానీ ఇప్పుడు రుచి తెలుసుకోలేకపోవడం కరోనా వైరస్ మొదటి లక్షణం అని పేపర్లలో, వార్తల్లో చూసి చూసి నిజంగానే కరోనా వచ్చిందేమోననే భయం కలుగుతోంది. గతంలో రోజుల తరబడి జలుబు ఉన్నా పెద్దగా పట్టించుకోని సైనసైటిస్ పేషెంట్లు, ఇప్పుడు నాలుగు రోజులు దాటితే కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కరోనా టెస్ట్ చేయించుకుని అందులో నెగెటివ్ వచ్చినా సరే చుట్టుపక్కల వాళ్లు దాన్ని పాజిటివ్ అని పుకార్లు పుట్టించి మానసికంగా క్షోభ పెడుతున్నారు.

ఇక ట్యాబ్లెట్లు కొనాలంటే పెద్ద అబద్ధాల కథను సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ఓ వైపు జలుబు, దగ్గు మందుల స్టాక్ అయిపోవడం, రెగ్యులర్‌గా వాడే మందులు దొరకకపోవడం, మెడికల్ షాపుల వాళ్లు ప్రిస్క్రిప్షన్ అడగడం ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనాలకు సాధారణ జలుబుకు, కరోనా వైరస్ జలుబుకు తేడాలు తెలియకపోవడమే ఈ సమస్యలన్నింటికీ కారణం. ఇతరుల మందబుద్ధి కారణంగా సైనసైటిస్, ఆస్తమా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అలాగని వారు ఊపిరి బిగబట్టడం, తుమ్ములు, దగ్గును ఆపుకోవడం వంటి పనులు చేయడం సబబు కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాబట్టి మీరు రెగ్యులర్‌గా ఎలా ఉంటారో అలాగే ఉండండి. నీరసంగా, నలతగా అనిపించినపుడు, జలుబు ఎక్కువగా ఉన్నపుడు ఇంటికే పరిమితం కావడం మంచిది.



Next Story

Most Viewed