చంద్రుని ఉల్కలో కొత్త ఖనిజం

by  |
చంద్రుని ఉల్కలో కొత్త ఖనిజం
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్ర గ్రహానికి సంబంధించిన ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్కలో యూరోపియన్ పరిశోధకుల బృందం ఒక కొత్త ఖనిజాన్ని కనిపెట్టింది. అధిక ఒత్తిడి ద్వారా ఏర్పడిన ఈ ఖనిజానికి డాన్‌‌విల్హెల్మ్‌సైట్ అని పేరు పెట్టారు. చంద్రుని నుండి రాళ్ల నమూనాను మొదటిసారి భూమ్మీదికి తీసుకొచ్చిన అపోలో స్పేస్ మిషన్స్‌లో సేవ చేసిన అమెరికన్ సైంటిస్ట్ డాన్ విల్హెల్మస్ జ్ఞాపకార్థం.. ఈ ఖనిజానికి ఆ పేరు పెట్టారు. ఈ కొత్త ఖనిజాన్ని లోతుగా అధ్యయనం చేయడం వల్ల భూఅంతర్భాగంలోని మాంటిల్‌లో జరిగే చర్యల గురించి అవగాహన కలిగే అవకాశం ఉందని అమెరికన్ మినరాలజిస్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ ఖనిజంలో కాల్షియం, అల్యూమినియం, సిలికాన్, ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఉన్నాయని తెలిపారు.

ఈ ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్క, పశ్చిమ సహారా ఎడారిలో 2014లో దొరికింది. ఈ ఉల్క పైభాగంలో ఉన్న ఖనిజ సమ్మేళనాలు, భూమ్మీద రాళ్లలో దాగున్న ఖనిజాలతో సరిపోలాయని, కానీ లోతుకు వెళ్లే కొద్దీ వాటి సమ్మేళనం మారిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీన్ని బట్టి భూఉపరితలం మీది రాళ్లతో పోలిస్తే, భూఅంతర్భాగంలోని రాళ్లకు సంబంధించి ఖనిజ సమ్మేళనాల్లో చాలా వైరుధ్యాలు ఉంటాయని వెల్లడైంది. అందుకే ఈ ఉల్కలోని కొత్త ఖనిజాన్ని లోతుగా అధ్యయనం చేయడం వల్ల దాదాపుగా భూఅంతర్భాగం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయని పరిశోధకుడు రిచర్డ్ విర్త్ తెలిపారు.

Next Story

Most Viewed