ఆశలు పెంచుతున్న చిన్నారి ఫొటో..

12

దిశ, వెబ్‌డెస్క్: ‘హోప్ ఈజ్ స్ట్రాంగర్ ద్యాన్ ఫియర్’ అంటే..భయం కంటే ఆశ బలమైనదని అర్థం. 2020 ప్రారంభం నుంచి ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల జీవితాలే తలకిందులైపోయి కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిన అలవాట్లు కావడం మరింత ఇబ్బందికరమైన విషయం. ముఖ్యంగా బయటికి వెళ్లేటపుడు మాస్క్ తప్పనిసరిగా మారింది. దీని వల్ల చాలా మందికి చికాకు కలుగుతోంది. పాత రోజులు మళ్లీ తిరిగి వస్తే బాగుండు అని బెంగ కలుగుతోంది. కానీ, మాస్క్ తీసేస్తే ఎక్కడ ప్రాణనష్టం జరుగుతుందోనని భయం అనిపిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భయాన్ని పక్కనబెట్టి ఆశావహ దృక్పథాన్ని అలవాటు చేసుకోవడానికి ఒక చిహ్నం కావాలి. త్వరలోనే మంచిరోజులు తిరిగి వస్తాయనే నమ్మకాన్ని కలిగించే భరోసా కావాలి. అలాంటి ఆశను అప్పుడే పుట్టిన చిన్నారి ఫొటో కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

దుబాయ్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సమీర్ చేయిబ్ ఈ ఫొటోను షేర్ చేశాడు. అప్పుడే పుట్టిన చిన్నారి తన నోటికి ఉన్న సర్జికల్ మాస్క్‌ను తొలగిస్తూ ఏడుస్తుండగా, ఆయన నవ్వుతున్నట్లు ఈ ఫొటోలో ఉంది. అంటే త్వరలోనే మాస్క్‌లు పోయి, మాములు రోజులు తిరిగి వస్తాయని శుభసూచకంగా ఈ చిన్నారి నమ్మకాన్ని కలిగిస్తున్నాడంటూ నెటిజనాలు ఈ ఫొటోను తెగ పొగిడేస్తున్నారు. ముందు ముందు చక్కని భవిష్యత్తు ఉందనే ఆశను ఈ చిన్నారి ఫొటో పెంపొందిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ, అలాంటి రోజులు రావాలి అంటే ముందు మాస్క్‌లు పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా భయం కన్న ఆశ బలమైనదే!