మాకొద్దీ లాక్‌డౌన్.. నెదర్లాండ్స్‌లో సెక్స్ వర్కర్ల నిరసన

by  |
మాకొద్దీ లాక్‌డౌన్.. నెదర్లాండ్స్‌లో సెక్స్ వర్కర్ల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతున్న నేపథ్యంలో పలు దేశాల ప్రభుత్వాలు అక్కడ తిరిగి లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ ఖండంలో చాలా దేశాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నాయి. అయితే దీనిని అక్కడి వ్యాపారులు, బార్ ఓనర్లు, సెక్స్ వర్కర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలే గతేడాది సుమారు ఆరునెలల పాటు విధించిన లాక్‌డౌన్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామనీ, మళ్లీ దానిని తిరిగి విధిస్తే తమ దారి గోదారి అవుతుందని వాపోతున్నారు.

నెదర్లాండ్స్, ఫ్రాన్స్, హంగేరి లకు చెందిన ప్రజలు లాక్‌డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాక్‌డౌన్‌ను నిరసిస్తూ.. నెదర్లాండ్స్‌లో బార్ ఓనర్లతో పాటు సెక్స్ వర్కర్లు ఆ దేశ పార్లమెంటు భవనం వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. గతేడాది అక్టోబర్‌లో లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చినట్టే ఇచ్చిన ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తున్నదని వాపోయారు. తాము ప్రభుత్వం చెప్పిన విధంగానే భౌతికదూరం పాటిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నా.. ప్రభుత్వ అధికారులు మాత్రం జరిమానాల పేరిట తమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నెదర్లాండ్స్‌లో సెక్స్ వర్కర్లు కూడా నిరసనలకు దిగుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా తాము జీవనోపాధి కోల్పోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఇక హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లోనూ పెద్దఎత్తున నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ‘మన జీవితాలను మళ్లీ తెచ్చుకుందాం..’ అనే నినాదాలు హోరెత్తాయి. ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.


Next Story

Most Viewed