Zepto: ధారావిలో జెప్టో ఫుడ్ బిజినెస్ లైసెన్స్ రద్దు

by S Gopi |

పూర్తిస్థాయిలో అనుమతులు, అధికారికంగా ధృవీకరించే వరకు లైసెన్స్ నిలిపేయనున్నట్టు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.

Zepto: ధారావిలో జెప్టో ఫుడ్ బిజినెస్ లైసెన్స్ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ధారావిలో జరిపిన ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో మాతృ సంస్థ కిరాణాకార్ట్ టెక్నాలజీస్ ఫుడ్ బిజినెస్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006, ఆహార భద్రత, ప్రమాణాలు (ఆహార వ్యాపారాల లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్) నిబంధనలు, 2011ను అనేకసార్లు ఉల్లంఘించినట్టు బయటపడింది. పూర్తిస్థాయిలో అనుమతులు, అధికారికంగా ధృవీకరించే వరకు లైసెన్స్ నిలిపేయనున్నట్టు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ధారావిలో ఆహార భద్రత, పరిశుభ్రత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్టు తనిఖీలో వెల్లడైంది. ఎఫ్‌డీఏ అధికారులు కొన్ని ఆహార పదార్థాలపై ఫంగస్, నిలిచిన నీటి నిల్వల వద్ద పదార్థాలను ఉంచడం, కోల్డ్ స్టోరేజ్ ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో వైఫల్యాలను కనుగొన్నారు. కొన్ని చోట్ల తడి, మురికి ఉన్నట్టు గుర్తించారు. ఆహార పదార్థాలు, ముడి పదార్థాలను నేలపైనే అస్తవ్యస్తంగా పడేయడం, గడువు ముగిసిన, గుడువు ఉన్న ఆహార ఉత్పత్తులను వేరు చేయకపోవడం వల్ల కస్టమర్లకు సరిగా లేని ఆహారం చేరే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అన్ని లోపాలను సరిదిద్ది, నియంత్రణ సంస్థ నుంచి క్లియర్ అయ్యే వరకు ధారావిలో జెప్టో ఆహార వ్యాపార కార్యకలాపాలు నిలిపేయనున్నారు. దీనిపై జెప్టో ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

Next Story