Russia-Ukraine war: మావాళ్లను అప్పగిస్తేనే వారిని విడుదల చేస్తాం.. రష్యాకు జెలెన్ స్కీ వార్నింగ్..!

by Shamantha N |

రష్యా (Russia)తో యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy) కీలక ప్రకటన చేశారు. మాస్కో చేతిలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. నార్త్ కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని ఆయన తాజాగా ప్రకటించారు.

Russia-Ukraine war: మావాళ్లను అప్పగిస్తేనే వారిని విడుదల చేస్తాం.. రష్యాకు జెలెన్ స్కీ వార్నింగ్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia)తో యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelenskyy) కీలక ప్రకటన చేశారు. మాస్కో చేతిలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే.. నార్త్ కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. అయితే, రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukraine war) యుద్ధంలో క్రెమ్లిన్ కు మద్దతుగా ఉత్తరకొరియా (North Korea) సైన్యం పోరాడుతోంది. కాగా.. రష్యా తరఫున పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తాము అదుపులోకి తీసుకున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గతంలో వెల్లడించారు. ఇప్పుడేమో.. వారిని విడుదల చేయాలంటే కీవ్ బలగాలను అప్పగించాల్సిందే అని చెప్పారు. ‘‘రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను అదుపులోకి తీసుకున్నాం. ఆ దేశానికి చెందిన మరికొందరు సైనికులను బందీలుగా చేసేందుకు మా దళాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా వద్ద బందీలుగా ఉన్న మా వారిని విడుదల చేస్తేనే వీరిని ఉత్తర కొరియాకు అప్పగిస్తాం’’ అని జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. వారికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్‌ భద్రతా బలగాలు వివరాలు వెల్లడించారు. బందీగా ఉన్న ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపారు.

రంగంలో 10వేల మంది సైనికులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మద్దతుగా దాదాపు 10వేల మంది ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తూ వచ్చింది. కానీ దీనిపై మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. ఉత్తరకొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని జెలెన్‌స్కీ అన్నారు. యుద్ధంలో పాల్గొన్నట్లు తెలియవద్దనే ఉద్దేశంతో గాయపడిన వారిని రష్యా సైనికులు తమకు చిక్కకుండా కాల్చి చంపేస్తుందని ఆరోపించారు. వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారని, చూడడానికి మాస్కో దళాలలానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వారి వారి మాటలు రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా యాసలో మాట్లాడుతున్నట్లు బయటపడిందన్నారు.

Next Story