- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాకు బంగ్లాను అమ్మేస్తున్నాడు..మహమ్మద్ యూనస్‌పై షేక్ హసీనా ఆరోపణలు
బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్‌పై షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాను అమెరికాకు యూనస్ అమ్మేస్తున్నాడని ఆమె అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్.. ఆ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నాడని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో తన అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేయడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ప్రస్తుత బంగ్లాదేశ్ పూర్తిగా మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆమె అన్నారు. తన ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రపంచ ఖ్యాతి గాంచిన యూనస్.. ఒక్కసారి అధికారంలోకి రాగానే ఉగ్రవాదులకు ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పాడని మండిపడ్డారు. ‘సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను కావాలన్న అమెరికా డిమాండ్లకు మా తండ్రి అంగీకరించలేదు. దాని వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. అధికారం కోసం నా దేశాన్ని అమ్ముకోవాలని అనుకోలేదు కాబట్టి.. నా తలరాత కూడా అదేనని నాకు తెలుసు’ అని ఆమె చెప్పారు.
తమ దేశంలో ఒక్క అంగుళాన్ని కూడా ఎవరికీ ఇవ్వాలని ఎవరూ అనుకోరని, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అదే జరుగుతోందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేశం అంతా గౌరవం ఇచ్చిన వ్యక్తి, ప్రపంచం అంతా మెచ్చిన వ్యక్తి.. ఒక్కసారి అధికారం చేతిలోకి రావడంతో అతను ఎలా మారిపోయాడో చూడండి’ అని ఆమె అన్నారు. ఉగ్రవాదుల సాయంతోనే బంగ్లాదేశ్‌లో అధికారాన్ని యూనస్ సాధించుకున్నాడని ఆమె మరోసారి పునరుద్ఘాటించారు. బంగ్లా ప్రజలను ఏ ఉగ్రవాదుల నుంచి తన ప్రభుత్వం కాపాడిందో, ఇప్పుడు అదే ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. తన అవామీ లీగ్ పార్టీని నిషేధించడంపై మండిపడిన ఆమె.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవని వ్యక్తులకు రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ‘రాజ్యాంగంలో చీఫ్ అడ్వైజర్ పదవి ప్రస్తావనే లేదు. అలాంటి వ్యక్తి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, పార్లమెంటు లేకుండా రాజ్యాంగంలోని చట్టాలు ఎలా మారుస్తారు?’ అని ఆమె నిలదీశారు.






