14 రోజుల రిమాండ్‌కు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా!

by Phanindra |   (  Updated:2025-05-26 12:38:43  IST  )

పాక్‌కు గూఢచర్యం చేస్తున్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమెను 14 రోజుల రిమాండ్‌కు పంపారు.

14 రోజుల రిమాండ్‌కు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. హర్యానాలోని హిసార్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న వారిపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌కు భారత సమాచారం అందజేస్తున్న 12 మందిని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో అరెస్టు చేశారు. వీరిలో జ్యోతి కేసు సంచలనం సృష్టించింది. ట్రావెల్ యూట్యూబర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ఆమె.. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగులతో సంబంధాలు కలిగి ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.

పలుమార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన ఆమె.. భారత్ బహిష్కరించిన పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్ అలియాస్ ఎహసాన్-ఉర్-రహీంతో కలిసి పాక్‌కు గూఢచర్యం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అరెస్టయిన తర్వాత విచారణలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కూడా తను టచ్‌లో ఉన్నానని, వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ యాప్‌లతో వారికి సమాచారం చేరవేసేదాన్నని ఆమె ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా.. ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడం జరిగింది.

Next Story