స్మార్ట్‌టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్..ఇకపై 90 సెకన్ల యాడ్స్‌!

by Prasad Jukanti |

స్మార్ట్‌టీవీ యూజర్లు ఇకపై 90 సెకన్ల వరకు యాడ్స్‌ను స్కిప్ చేయకుండా చూసేలా యూట్యూబ్ కసరత్తు చేస్తోంది.

స్మార్ట్‌టీవీ యూజర్లకు యూట్యూబ్ షాక్..ఇకపై 90 సెకన్ల యాడ్స్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube) స్మార్ట్‌టీవీ (Smart TV) యూజర్లకు భారీ షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ప్రకటనల నిడివిని భారీగా పెంచుతూ, ఏకంగా 90 సెకన్ల పాటు అన్‌స్కిప్పబుల్ యాడ్స్‌ను (Unskippable Ads) ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే కొంత మంది యూజర్లు తమకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయని ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీల్లో 30 సెకన్ల అన్ స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. ఇకపై వీటిని 90 సెకన్ల పాటు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి ఉన్న వీడియోలకు ఈ తరహా యాడ్స్ పుష్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రీమియం వైపు అడుగులు

ప్రకటనల ఇబ్బంది లేకుండా వీడియోలు చూడాలనుకునే వారిని 'యూట్యూబ్ ప్రీమియం' సబ్‌స్క్రిప్షన్ తీసుకునేలా ప్రోత్సహించడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణమని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓ వైపు సంప్రదాయ ప్రకటనదారులను ఆకర్షించడంతో పాటు యాడ్స్‌ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం స్మార్ట్‌టీవీలకు మాత్రమే పరిమితమవుతుందా లేక భవిష్యత్తులో మొబైల్ వినియోగదారులకు కూడా వర్తిస్తుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే 90 సెకన్ల నిడివి పట్ల వినియోగదారుల ప్రకటనలు రావడం పట్ల వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్ లో కార్యరూపం దాల్చనుందా లేదా అనేది యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story