Maha kumbh: గంగానదీ జలాలు తాగేందుకు కూడా అనుకూలమే- యూపీ సీఎం

by Shamantha N |

ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమైనట్లు వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఖండిచారు.

Maha kumbh: గంగానదీ జలాలు తాగేందుకు కూడా అనుకూలమే- యూపీ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమైనట్లు వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఖండిచారు. నదీ జలాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నదీ జలాలు స్నానాలకే కాకుండా తాగేందుకూ అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గంగానదిలో ప్రమాదకర స్థాయిలో ‘ఫేకల్ కోలిఫాం’ బ్యాక్టీరియా (faecal coliform bacteria) ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ).. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (National Green Tribunal – NGT) కు నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదికపై యూపీ అసెంబ్లీలో యోగి మాట్లాడారు. సనాతన ధర్మం, మా గంగ, దేశం, మహాకుంభమేళాపై నిరాధారమైన ఆరోపణలు చేసినా, నకిలీ వీడియోలను ప్రదర్శించినా 56 కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ఆడుకున్నట్లే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 56 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపారు. కుంభమేళా ఏర్పాట్లపై భక్తులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించినట్లు పేర్కొన్నారు.

తొక్కిసలాటపై..

అంతేకాకుండా, కుంభమేళాలో జనవరి 29న జరిగిన తొక్కిసలాట ఘటనపైనా యోగి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సాయం చేస్తుందన్నారు. కుంభమేళా తొక్కిసలాటపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు" దీనిని రాజకీయం చేయడం ఎంతవరకు సముచితం? వారు (ప్రతిపక్షాలు) మొదటి రోజు నుండి మహా కుంభ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. గత అసెంబ్లీ సెషన్‌లో, మహా కుంభ్ కోసం చర్చలు, సన్నాహాలు జరిగాయి. ప్రణాళికలను చర్చించి సూచనలు తీసుకునేవాళ్లం. కానీ, మీరు సభను నడపనివ్వలేదు" అని అన్నారు. ఇకపోతే, కుంభమేళాపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. మహాకుంభ్‌కు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. అదేవిధంగా మహాకుంభమేళాను ‘అర్థం లేని’ కార్యక్రమంగా అంటూ రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఇక పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్‌’ అంటూ వ్యాఖ్యానించారు. వీరు చేసిన విమర్శలకు యోగి స్పందిస్తూ.. ‘సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే.. యూపీ సర్కారు ఆ నేరం చేస్తూనే ఉంటుంది’ అంటూ గట్టిగా బదులిచ్చారు.

Next Story