- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ప్రభుత్వంపై 'ఎక్స్' దావా
సెక్షన్ 69ఏ ప్రకారం జాతీయ భద్రతను కాపాడటం వంటి నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే బ్లాక్ చేయడానికి అనుమతి ఇస్తుంది.

- ఎక్స్‌లో ట్వీట్ల తొలగింపు, నిరోధంపై అభ్యంతరం
- చట్టపరమైన విధానాలు దాటవేస్తోందని ఆరోపణ
- కర్ణాటక హైకోర్టులో ఎలాన్ మస్క్ సంస్థ పిటిషన్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని మైక్రో బ్లాగింగ్ సైట్ 'ఎక్స్' భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బి)ని ఉపయోగిస్తూ ట్వీట్లను తొలగించడం, ఇతర కంటెంట్‌ను నిరోధించడం వంటి చర్యలకు పాల్పడుతోందని, ఇది ఏకపక్ష సెన్సార్‌షిప్‌కు దారి తీస్తోందని 'ఎక్స్' ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఇండియాలోని ప్రభుత్వ అధికారులు చట్ట విరుద్దంగా ఆన్‌లైన్ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్స్ ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఐటీ చట్టం ప్రకారం.. అధికారులు ఆదేశించినప్పుడు కంటెంట్‌ను తొలగించకపోయినా, బ్లాక్ చేయకపోయినా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తమ చట్టపరమైన రక్షణను కోల్పోతాయి. దీన్నే సేఫ్ హార్బర్ అంటారు. అయితే ఈ సెక్షన్ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వదని, కంటెంట్ బ్లాక్ చేయాలంటే వివరణాత్మకమైన సమీక్షలు అవసరమని 'ఎక్స్' వాదిస్తోంది. సెక్షన్ 69ఏను పక్కదారి పట్టించి, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని 'ఎక్స్' తమ పిటిషన్‌లో పేర్కొంది.
సెక్షన్ 69ఏ ప్రకారం జాతీయ భద్రతను కాపాడటం వంటి నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే బ్లాక్ చేయడానికి అనుమతి ఇస్తుంది. అలాగే ఆ కంటెంట్‌పై సమీక్ష ప్రక్రియ తప్పని సరిగా అవసరమని 'ఎక్స్' పేర్కొంది. అయితే దీనికి విరుద్దంగా సెక్షన్ 79(3)(బి)ని ఉపయోగించి.. అధికారులు కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి అధికారాలను అనుమతించారని.. ఇది ఇండియాలో విస్తృత స్థాయి సెన్సార్‌షిప్‌కు దారి తీస్తోందని ఎక్స్ హెచ్చరించింది.ఈ చర్యలు ఇండియాలో తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని ఎక్స్ తెలిపింది. సెక్షన్ 79(3)(బి) ప్రకారం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నిర్వహిస్తున్న సహయోగ్ పోర్టల్‌లో చేరాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని.. దీనికి తాము వ్యతిరేకమని ఎక్స్ తెలిపింది.
సహయోగ్ అనేది ఒక సెన్సార్‌షిప్ పోర్టల్ అని.. ఈ వ్యవస్థను సృష్టించడానికి లేదా కంపెనీలను వాటి కోసం ప్రత్యేక అధికారులను నియమించమని బలవంతం చేయడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని దావాలో పేర్కొంది. 2021 ఐటీ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఉన్న నియమాలను 'ఎక్స్' పాటిస్తోందని చెప్పింది. కాగా ఈ దావాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి ముందుకు వెళ్తుందని.. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.






