PM Modi: ఒక్కరోజు సైంటిస్టులుగా మారండి

by S Gopi |

దీన్ని పురస్కరించుకుని మన పిల్లలు, యువత సైన్స్ పట్ల ఆసక్తి చూపించాలని కోరారు.

PM Modi: ఒక్కరోజు సైంటిస్టులుగా మారండి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు కీలక అంశాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన 119వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన విజయాలను, శాస్త్రవేత్తలను ప్రశంసించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మహిళా సాధికారత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 'ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. దీన్ని పురస్కరించుకుని మన పిల్లలు, యువత సైన్స్ పట్ల ఆసక్తి చూపించాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సైంటిస్టులుగా మారాలని, సైన్స్ సెంటర్లకు వెళ్లి పరిశోధనలు పరిశీలించాలని సూచించారు. తమకు అనువైన ఏదొక రోజును ఎంచుకుని తప్పనిసరిగా రీసెర్చ్ ల్యాబ్, స్పేస్ సెంటర్‌ను సందర్శించాలని' చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో వరుస విజయాలను ప్రశంసిస్తూ.. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 సహా ఒకేసారి 104 శాటిలైట్‌లను నింగిలోకి పంపడం ద్వారా కీలక విజయాలతో దూసుకెళ్తోంది. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదని, అంతరిక్ష శాస్త్రంలో సరికొత్త శిఖరాలను సాధించాలనే సంకల్పాన్ని సూచిస్తుంది. ఇస్రో గడిచిన పదేళ్లలో దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో అనేక ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి కూడా ఉన్నాయని చెప్పారు.

మహిళలకు ప్రధాని మోడీ సోషల్ మీడియా అకౌంట్లు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సాధించిన ఉమెన్ అచీవర్స్‌కు తన సోషల్ మీడియా ఖాతాలను అందజేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తన ప్రసంగంలో వివిధ రంగాల్లో విజయం సాధించిన ఈ మహిళలు తమ పని, అనుభవం గురించి తన సోషల్ మీడియా ఖాతాలలో చెబుతారని చెప్పారు. మహిళల అద్వితీయమైన స్ఫూర్తిని గౌరవిద్దాం అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. గత కొన్నేళ్ల నుంచి భారత అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూనే ఉందన్నారు. కాగా గతంలో 2020, మార్చి 8న సైతం ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాలను వివిధ రంగాల్లోని ఏడుగురు మహిళలకు ఇచ్చారు.

తెలంగాణ టీచర్‌కు మోడీ ప్రశంసలు

ఇదే కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వినియోగం గురించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొడిసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో ప్రభుత్వానికి అందించిన సాయాన్ని గుర్తుచేశారు. ఏఐను ఉపయోగించి కొలామి భాషలో పాటను రూపొందించారని తెలిపారు. ఏఐ టెక్నాలజీ వినియోస్తూ దేశం మరింత పురోగతి సాధిస్తోందన్నారు.

ఊబకాయంతో పోరాటం

దేశంలో పెరుగుతున్న ఊబకాయం గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఊబకాయంతో పోరాడటానికి ఆహారంలో తక్కువ నూనెను ఉపయోగించాలని ప్రజలను కోరారు. సగటు వినియోగంలో 10 శాతం వరకు తగ్గించుకోవాలన్నారు. ఆహారంలో తక్కువ నూనె వాడకం కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు, మన కుటుంబం పట్ల మన బాధ్యత కూడా అని ప్రధాని మోడీ అన్నారు.

Next Story