యువతిని చెంపదెబ్బ కొట్టిన ఉబెర్ డ్రైవర్.. స్పందించిన సంస్థ!

by Gantepaka Srikanth |

ముంబైలో ఒక మహిళా ప్రయాణికురాలిపై ఉబెర్ (Uber) క్యాబ్ డ్రైవర్ దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

యువతిని చెంపదెబ్బ కొట్టిన ఉబెర్ డ్రైవర్.. స్పందించిన సంస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో ఒక మహిళా ప్రయాణికురాలిపై ఉబెర్ (Uber) క్యాబ్ డ్రైవర్ దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.40 అదనపు టోల్ ఛార్జీల వివాదంతో మొదలైన గొడవ.. మహిళపై చేయి చేసుకునే స్థాయికి చేరింది. బాధితురాలు ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం... ఆమె బుక్ చేసిన ఉబెర్ రైడ్‌కు యాప్‌లో రూ.501 బిల్లు చూపించింది. అయితే, ప్రయాణం ముగిసే సమయంలో డ్రైవర్ యాప్‌తో సంబంధం లేకుండా రూ.40 టోల్ టాక్స్ అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. “నేను అదనపు డబ్బులు ఇవ్వనని చెప్పడంతో అతను నన్ను బెదిరించడానికి ప్రయత్నించాడు. అరుస్తూ దగ్గరగా రావడంతో అతడిని వెనక్కినెట్టాను. దాంతో అతను కోపంతో ఊగిపోతూ నా చెంపపై కొట్టాడు. అంతేకాకుండా నా చేతిని పట్టుకుని గట్టిగా తిప్పడంతో నాకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత కొడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు’’ అంటూ ఇదంతా బాధితురాలు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. "ఇది కేవలం సర్వీస్ లోపం కాదు. మహిళా ప్రయాణికుల భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్య" అని ఆమె స్పష్టం చేసింది.

ఉబెర్ స్పందన..

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఉబెర్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉబెర్ ప్రతినిధి స్పందిస్తూ "బాధితురాలు శివానికి ఎదురైన అనుభవానికి మేము ఎంతో విచారిస్తున్నాము. ఉబెర్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఇలాంటి భౌతికదాడులకు, బెదిరింపులకు ఎలాంటి స్థానం లేదు. మేము డ్రైవర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పాలసీల ప్రకారం సదరు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకున్నాము" అని తెలిపారు. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే ఉబెర్ సంస్థ బాధితురాలైన శివాని అకౌంట్‌ను కూడా కాసేపు నిలిపివేయడం (Disable)పై నెటిజన్లు మరింత మండిపడ్డారు. తప్పు చేసిన డ్రైవర్‌ను వదిలేసి, బాధితురాలి అకౌంట్ ఎలా బ్లాక్ చేస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై ఉబెర్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించామని స్పష్టం చేశారు. అంతేకాదు.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రక్రియలో తాము పూర్తి సహాయసహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది.

Next Story