55 ఏళ్ల వయసులో 17వ బిడ్డ.. అబద్ధానికి బిత్తరపోయిన వైద్యులు

by Naga Rani Yarlagadda |

నేటి కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు అప్పుడే పిల్లలు వద్దని ప్లాన్ చేసుకుని మరీ నాలుగైదేళ్ల తర్వాత కంటున్నారు.

55 ఏళ్ల వయసులో 17వ బిడ్డ.. అబద్ధానికి బిత్తరపోయిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన పూర్వీకుల కాలంలో ఒక్కొక్కరు డజను మందికి పైగా పిల్లల్ని కనేవారని విన్నాం. అప్పట్లో జనాభా తక్కువ. కాలం మారుతున్న కొద్దీ జనాభా పెరుగుతూ రావడంతో.. ప్రభుత్వాలు ఏర్పడ్డాక పిల్లల్ని కనడంపై అవగాహన కల్పించడంతో ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది.

నేటి కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు అప్పుడే పిల్లలు వద్దని ప్లాన్ చేసుకుని మరీ నాలుగైదేళ్ల తర్వాత కంటున్నారు. కొందరైతే ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు అని ఒకరిని కన్నాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్పత్రి వైద్యుల్ని సైతం షాక్ కు గురిచేసింది. వారు ఆస్పత్రిలో చేరేటపుడు ఇది నాలుగో కాన్పు అని అబద్ధం చెప్పడమే వైద్యులు బిత్తరపోవడానికి కారణమైంది.

ఉదయ్ పూర్ జిల్లా జాడోల్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డతో కలిపి ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల సంఖ్య 24కి చేరుకుంది. దీనికి కారణం వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పై అవగాహన లేకపోవడం అని తెలుస్తోంది. రేఖ అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరినపుడు ఇది తమకు నాల్గవ కాన్పు అని చెప్పారని జాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ రోషన్ దరంగి తెలిపారు. 17 మంది సంతానంలో 12 మంది బ్రతికి ఉండగా.. 35 ఏళ్ల కొడుకు, కోడలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అధిక సంతానం కారణంగా ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.

ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకూ కుటుంబ నియంత్రణ చేసుకునేలా ఎవరైనా సంప్రదించారా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని మరో వైద్యుడు మధు రితేశ్వర్ తెలిపారు. కాగా.. రేఖ భర్త కవర కల్బెలియా చెత్త ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి సంతానం ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు ఉండగా.. ఒక్కరు కూడా ఇంతవరకూ పాఠశాల ముఖం చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఎత్తి చూపుతోంది.

Next Story