మహిళ ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్.. నొప్పితో విలవిలలాడిందంటూ పాపం ఆ భర్త..

by Naga Rani Yarlagadda |

నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మహిళ ప్రాణం తీసిన ట్రాఫిక్ జామ్.. నొప్పితో విలవిలలాడిందంటూ పాపం ఆ భర్త..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన ఛాయా పురవ్ ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ లో నరకం అనుభవించింది. ఛాయా పురవ్ మధుకర్ నగర్లోని తన ఇంటికి సమీపంలో జులై 31న చెట్టుకొమ్మ విరిగి పడటంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా.. పక్కటెముకలు, భుజాలు, తలకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. అయితే పాల్ఘర్లో ట్రామా సెంటర్ లేకపోవడంతో ఆమెను ముంబైలోని హిందుజా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

పాల్ఘర్ నుంచి ఆ ఆస్పత్రికి చేరుకోవాలంటే దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది. అప్పటి వరకూ నొప్పిని తట్టుకునేందుకు అనస్థీషియా ఇచ్చారు. భర్త పురవ్ కూడా అంబులెన్స్ లోనే వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబులెన్స్ పాల్ఘర్ నుంచి బయల్దేరగా.. నేషనల్ హైవే 48పై భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. సాయంత్రం 6 గంటలకు సగం దూరం మాత్రమే వెళ్లగా.. అనస్థీషియా పవర్ తగ్గుతూ వచ్చింది. నొప్పి ఎక్కువ కావడంతో ఛాయా కేకలు పెట్టింది. రాత్రి 7 గంటల సమయానికి హిందుజా ఆస్పత్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరారోడ్ లోని ఆర్బిట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అరగంట ముందుగా తీసుకువచ్చి ఉంటే ఛాన్స్ ఉండేదని వైద్యులు చెప్పడంతో.. ట్రాఫిక్ జామ్ వల్ల తన భార్య నొప్పితో అల్లాడిపోయి ప్రాణాలు విడిచిందంటూ పురవ్ కంటతడి పెట్టుకున్నారు. పైగా రోడ్లు గుంతలుగా ఉండటంతో నొప్పి తట్టుకోలేక పోతున్నానని, తనను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వేడుకుందని వాపోయారు.

Next Story