Shashi Tharoor: పాకిస్థాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

పాకిస్థాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంలో మన దేశంపై కుట్రలకు పాల్పడుతున్న పాక్ ను ఎండగట్టేందుకు శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రపంచదేశాలకు బయల్దేరింది.

Shashi Tharoor: పాకిస్థాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంలో మన దేశంపై కుట్రలకు పాల్పడుతున్న పాక్ ను ఎండగట్టేందుకు శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రపంచదేశాలకు బయల్దేరింది. ఈసందర్భంగానే దేశం తరఫున గొంతుకను వినిపించేందుకు వెళ్తున్నామంటూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌, అమెరికాకు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నా. దేశం తరఫున గొంతును వినిపించేందుకు వెళ్తున్నాం. మన దేశం అత్యంత క్రూరమైన రీతిలో ఉగ్రవాదుల దాడికి గురైంది. ఉగ్రవాదులు చెలరేగుతూంటే భారత్ మౌనంగా ఉండదనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెపుతాం. సత్యంపై విజయం సాధించడానికి ఉదాసీనత మనకు అవసరం లేదు. ఇది మా బాధ్యత. వాస్తవానికి దూరంగా ఎలాంటి ప్రకటనలు చేయం. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్‌ విశ్వసిస్తోంది. ఇది ప్రపంచానికి తెలియచేడమే మా లక్ష్యం. జై హింద్‌’ అని శశిథరూర్ పేర్కొన్నారు. దీన్ని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా..

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. దీంతో, పాక్ భారత్ పై ఎదురుదాడికి యత్నించింది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈనేపథ్యంలోనే కేంద్రం ఈ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. అందులోభాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. వాటిలో మూడు బృందాలు ఇప్పటికే పలు దేశాలకు వెళ్లాయి. మిగిలిన నాలుగు బృందాలు విదేశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి. ఈక్రమంలోనే విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఆ నాలుగు బృందాలతో సమావేశమయ్యారు. అందులో శశిథరూర్‌ బృందంతో పాటు బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, బీజేపీ నేత బై జయంత్‌ పాండా నేతృత్వం వహిస్తున్న బృందాలు ఉన్నాయి. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిణామాల గురించి మిస్రీ వివరించారు.

Next Story