Karnataka: హిందూ మతంలో సమానత్వం లేదు

by S Gopi |

హిందువులు మతం మారేందుకు మనలో మనకే సమానత్వం లోపించడమే కారణమని అన్నారు

Karnataka: హిందూ మతంలో సమానత్వం లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హిందువులు మతం మారేందుకు మనలో మనకే సమానత్వం లోపించడమే కారణమని అన్నారు. కులగణనపై జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కర్ణాటక సీఎం.. హిందూ మతంలో సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చు. మేము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదు, కానీ ప్రజలు మతం మారుతున్నారు, అది వారి హక్కు. హిందూ మతంలో సమానత్వం, సమానవకాశాలు లేకపోవడం వల్లనే మతం మారుతున్నారు. హిందుమతంలో సమానత్వమే ఉంటే, ఎవరైనా ఎందుకని మతం మారుతారా? అని ప్రశ్నించారు.

ఈ సమయంలోనే అంటరానితనాన్ని తాము తీసుకొచ్చామా అని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ సైతం తీవ్రంగా ఖండించింది. ఇతర మతాల గురించి మాట్లాడే ధైర్యం సిద్ధరామయ్యకు ఉందా అంటూ శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష నేత ఆర్ అశోక నిలదీశారు. ఇస్లాం గురించి ఇలాగే ప్రశ్నించే ధైర్యం సిద్ధరామయ్యకు ఉందా అంటూ స్పందించారు. ఇస్లాంలో సమానత్వం ఉంటే ముస్లిం మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతి లేదు, ట్రిపుల్ తలాక్ నిషేధాన్ని ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు.

అవును, కుల వ్యవస్థ హిందూ సమాజంలో ఒక శాపం, ఇది వాస్తవం. కానీ చాలామంది గొప్ప సంస్కర్తలు కాలక్రమేణా హిందూ సమాజాన్ని సరిదిద్దడానికి, మార్చడానికి ప్రయత్నించారు. హిందూ సమాజానికి తనను తాను సరిదిద్దుకునే, మార్చుకునే శక్తి ఉంది. బసవన్న నుంచి స్వామి వివేకానంద వరకు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచి నేటి వరకు, లెక్కలేనంత మంది సంస్కర్తలు హిందూ సమాజాన్ని మెరుగుపరచడానికి పనిచేశారు. పని చేస్తూనే ఉన్నారు. కానీ ఇస్లాంలో, లోతుగా పాతుకుపోయిన మౌలికవాదం, జిహాదీ మనస్తత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు లేదా సరిదిద్దలేదు. సంస్కర్తలు ఉద్భవించినప్పటికీ, ముస్లింలు అలాంటి మార్పును ఎప్పుడూ అంగీకరించలేదని అశోక అన్నారు.

కులం, మతం పేరుతో ప్రజలను విభజించేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత చలవాడి నారాయణస్వామి సిద్ధరామయ్యను విమర్శించారు. కులగణన విషయంలోనూ దళిత క్రైస్తవుడు, లింగాయత్ క్రైస్తవుడు, వొక్కలిగ క్రైస్తవుడు వంటి ఎంపికలు ఉన్నాయి. ఇది అర్ధంలేనిది, సోనియా గాంధీని సంతోషపెట్టడానికే సిద్ధరామయ్య ఇలా చేసారని అన్నారు. సనాతన ధర్మాన్ని సీఎం సిద్ధరామయ్య తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

Next Story