Delhi High Court: కెపాసిటీకి మించి టికెట్లు ఎందుకు విక్రయించారు?- రైల్వేపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

by Shamantha N |

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట (Delhi Railway Station stampede) ఘటన ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, రైల్వేపై తీవ్రంగా స్పందించింది.

Delhi High Court: కెపాసిటీకి మించి టికెట్లు ఎందుకు విక్రయించారు?- రైల్వేపై ఢిల్లీ హైకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట (Delhi Railway Station stampede) ఘటన ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, రైల్వేపై తీవ్రంగా స్పందించింది. కెపాసిటీకి మించి టికెట్లను ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది. రైల్వేస్టేషన్లలో తొక్కిసలాట ఘటనలు నివారించేందుకు భద్రతాచర్యలు, బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రైల్వే బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేయాలన్ని నిబంధనను అమలు చేయడంలో, టికెట్ లేకుండా ప్రవేశించే వ్యక్తులకు జరిమానా విధించేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చిన్నచిన్న నిబంధనలు సరిగ్గా అమలు చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదికాదుకదా?. సరే.. రద్దీ సమయంలో పరిమితి కంటే ఎక్కువమందిని అనుమతించామని అనుకుంటే.. దానికి తగినట్లుగా సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రయాణికులకు జారీ చేసిన టిక్కెట్ల సంఖ్య.. సీట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఎందుకు ఉంది?’’ అని కోర్టు వరుసగా ప్రశ్నలు సంధించింది. రైల్వే తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తొక్కిసలాట ఘటనలకు సంబంధించిన అన్ని అంశాలను రైల్వే బోర్డు పరిశీలిస్తుందని తెలిపారు. వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పరిస్థితికి సంబంధించి అన్ని అంశాలను రైల్వే బోర్డు పరిశీలిస్తుందని చెప్పారు. కాగా.. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 26న జరగనుంది.

కుంభమేళాలో తొక్కిసలాట

కాగా.. మహాకుంభమేళా (Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోని గతవారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్(Delhi Railway Station stampede) లో తొక్కిసలాట జరిగింది. 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచి ఉండడంతో ప్యాసింజర్లు అక్కడికి చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు జరిగింది. ఆ ప్రమాదంలో 18 మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపైనే ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story