మేక్ ఇన్ ఇండియా.. ఇప్పటికీ మేడ్ ఇన్ చైనా పైనే ఆధారపడి ఉంది ఎందుకు?

by Naga Rani Yarlagadda |

బయటి దేశాల నుంచి భారత్ పై ఒత్తిడి పెరిగిన ప్రతీసారి మేక్ ఇన్ ఇండియా నినాదం గట్టిగా వినిపిస్తుంది.

మేక్ ఇన్ ఇండియా.. ఇప్పటికీ మేడ్ ఇన్ చైనా పైనే ఆధారపడి ఉంది ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: బయటి దేశాల నుంచి భారత్ పై ఒత్తిడి పెరిగిన ప్రతీసారి మేక్ ఇన్ ఇండియా నినాదం గట్టిగా వినిపిస్తుంది. 2014లో ఈ నినాదం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలైనా, చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలైనా, లేదా పండుగ సీజన్‌లో స్థానికంగా కొనమని ప్రోత్సాహించడమైనా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఈ నినాదం మొదలై పదేళ్లు దాటినా ఇంకా ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది. నిజంగా మేక్ ఇన్ ఇండియా మన దేశానికి లాభాలను తెచ్చిపెడుతోందా ? లేక మేడ్ ఇన్ చైనా వస్తువుల్ని దొడ్డిదారిన దేశంలోకి తీసుకొస్తోందా? అన్న సందేహం ఉంది.

నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రారంభించినప్పుడు, భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలని, కోట్లాది ఉద్యోగాలు సృష్టించాలని, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 నాటికి తయారీ రంగం GDPలో 15% నుంచి 25%కు పెంచాలన్నది ఆయన ఆలోచన. కానీ హిన్రిచ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం.. ఒక దశాబ్దం తర్వాత అది అంత సులభం కాదని తేలింది. భారత్ స్మార్ట్‌ఫోన్‌లు, సోలార్ మాడ్యూళ్లు, కొన్ని రక్షణ సామాగ్రి వంటి ఉత్పత్తులను అసెంబుల్ చేయడంలో పురోగతి సాధించింది. కానీ ఇప్పటికీ చైనా నుంచి కాంపోనెంట్స్, ముడి పదార్థాలు, సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతోంది. గతంలో పూర్తిగా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు అవి కాంపోనెంట్స్‌గా మారాయి. కానీ చైనా మన సప్లై చైన్‌లో ఇప్పటికీ గట్టిగా ఉంది.

చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటు

ప్రభుత్వ డేటా ఈ సమస్య ఎంత పెద్దదో చూపిస్తుంది. 2024/25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు చైనాతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2023/24లో 85.08 బిలియన్, 2022/23లో 83.2 బిలియన్, 2021/22లో 73.31 బిలియన్ డాలర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. మార్చి 2025లో ఒక్క నెలలోనే చైనా నుంచి దిగుమతులు 25% పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు, సోలార్ సెల్స్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మొత్తం ఏడాదిలో చైనా నుంచి దిగుమతులు 113.5 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ చైనాకు ఎగుమతులు మాత్రం తగ్గాయి. మార్చి 2025లో 14.5% తగ్గి 1.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మొత్తం ఏడాది ఎగుమతులు 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే. ఫలితంగా.. చైనా, అమెరికా తర్వాత భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. మొత్తం వాణిజ్యం 127.7 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ ఎక్కువగా చైనా వైపే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.

2020లో 14 రంగాల కోసం 1.9 ట్రిలియన్ రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ప్రారంభమైంది, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులు, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిలో కొంత పురోగతి సాధించాం. సుంకాలు, దేశీయ ఇన్సెంటివ్‌ల వల్ల చైనా సోలార్ దిగుమతులు 90% నుంచి సెల్స్‌కు 56%, మాడ్యూళ్లకు 66%కి తగ్గాయి. కానీ తయారీ రంగం GDPలో వాటా 14% కంటే తక్కువకు పడిపోయింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రారంభమైనప్పుడు కంటే తక్కువ. స్పెషాలిటీ స్టీల్, టెక్స్‌టైల్స్, ఆటో పార్ట్స్, బ్యాటరీల వంటి రంగాలు లక్ష్యాలను చేరుకోలేదు. జనరిక్ డ్రగ్ ఇండస్ట్రీకి అవసరమైన 70% యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియంట్స్ (APIs) ఇప్పటికీ చైనా నుంచి వస్తున్నాయి. డ్రోన్‌ల కోసం 70% కాంపోనెంట్స్ చైనా నుంచే. స్మార్ట్‌ఫోన్‌లలో 99% భారత్‌లో అసెంబుల్ అవుతున్నాయి.

రాజకీయాలు, భద్రత, ఆర్థిక విషయాలు

2017, 2020లో సరిహద్దు ఉద్రిక్తతల వల్ల చైనా యాప్‌లపై నిషేధం, పెట్టుబడి నియమాలు కఠినం చేయడంతో చైనా పౌరులకు వీసాలపై పరిమితులు వచ్చాయి. ఇవి జాతీయ భద్రత కోసం అయినా, భారత తయారీదారులకు కీలక కాంపోనెంట్స్, భాగస్వామ్యాలు పొందడం కష్టమైంది. అయినా.. ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూనే ఉంది. చైనా నుంచి డిస్‌ప్లే మాడ్యూళ్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, బ్యాటరీ భాగాల వంటి కాంపోనెంట్స్ దిగుమతులు ఎక్కువయ్యాయి. 2025లో ప్రభుత్వం కాస్త మెత్తగా మారినట్లు కనిపిస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్, జెట్‌వర్క్, మైక్రోమాక్స్ వంటి భారత కంపెనీలు చైనా కంపెనీలతో జాయింట్ వెంచర్స్ కోసం చూస్తున్నాయి. డిక్సన్ ఇప్పటికే చైనా యొక్క HKCతో కలిసి సెమీ కండక్టర్ డిస్‌ప్లే మాడ్యూళ్లు తయారు చేస్తోంది. కొందరు అధికారులు.. చైనా సప్లై చైన్‌లతో లోతైన అనుసంధానం భారత తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని అంటున్నారు. కానీ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వంటివారు ఇంతలా ఆధారపడితే.. స్ట్రాటజిక్ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, నైపుణ్యాల లోపం

హిన్రిచ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడి చాలా తక్కువ. పెద్ద భారత కంపెనీలు ప్రపంచ స్థాయి కంపెనీలతో పోలిస్తే R&Dపై తక్కువ ఖర్చు చేస్తాయి, దీని వల్ల పేటెంట్లు తక్కువ, సాంకేతికతను స్వీకరించడం నెమ్మదిగా ఉంది. EV బ్యాటరీలు, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ వంటి కీలక రంగాల్లో చైనా చాలా ముందుంది. అక్కడ వాళ్లు ముఖ్యమైన పేటెంట్లు, గ్లోబల్ సప్లై చైన్‌లను నియంత్రిస్తున్నారు. భారత స్టార్టప్‌లు కన్స్యూమర్ యాప్‌లపై దృష్టి పెడుతున్నాయి కానీ.. అడ్వాన్స్డ్ టెక్నాలజీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. భారత్ చైనాపై కాంపోనెంట్స్‌కు, అమెరికాపై అధునాతన సాంకేతికతకు, రష్యాపై ఇంధనం, రక్షణ సరఫరాలకు ఆధారపడుతూ వెళ్తూ ఉంటే.. చైనా పెట్టుబడులు, ఉద్యోగాలు, తయారీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల భారత్ స్ట్రాటజిక్ బలహీనతలు పెరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Next Story