- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Assembly Elections : ఢిల్లీ పీఠం దక్కేదెవరికి?
సోమవారం సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఈ రెండు రోజులు ఎలాంటి ప్రచారం ఉండదు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం, ప్రకటించిన హామీలతో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఈ నెల 8న తెలిసిపోతుంది.

- భారీగా బెట్టింగ్స్
- ఆప్‌కే ఎడ్జ్ చూపిస్తున్న సట్టా బజార్
- కొద్ది సీట్లతో వెనుకబడిన బీజేపీ!
- కాంగ్రెస్ ఖాతా తెరవడం డౌటే?
- ఎన్నికల్లో కీలకం కానున్న అంశాలు ఇవే
- ముగిసిన ప్రచారం
దిశ, నేషనల్ బ్యూరో:
దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా నాలుగో సారి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆప్‌ను కాదని ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఆ సర్వేలను నమ్మకుండా.. విజయం తమదేననే ధీమాగా ఉంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీలో గెలుపు రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఉత్సాహాన్ని నింపుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఎన్డీయే నేతలను ఢిల్లీలో దింపి ప్రచారాన్ని ఉధృతం చేసింది.
సట్టా బజార్ ఏమంటోంది?
ఢిల్లీ ఎన్నికలపై భారీ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బెట్టింగ్‌లకు కేంద్రంగా ఉండే రాజస్థాన్ పలోడీ బజార్ సట్టా మార్కెట్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దృష్టి పెట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి ప్రతీ వారం తమ అంచనాలను చెబుతున్న సట్టా బజార్.. పోలింగ్‌కు ముందు చెప్పిన అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సట్టా బజార్ అంచనాల మేరకు ఆప్ 38 నుంచి 40 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు కాగా.. గత వారం 37 నుంచి 39 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనాలు చెప్పిన సట్టా బజార్.. పోలింగ్‌కు ముందు ఆప్ పరిస్థితి కాస్త మెరుగు పడినట్లు అంచనా వేయడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. అయితే 2015, 2020లో భారీగా సీట్లు గెలుచుకొని.. ఏకపక్ష విజయం సాధించిన ఆప్‌కు 2025 ఎన్నికల్లో మాత్రం భారీ ఎదురు దెబ్బే తగలనుంచి. ఆ పార్టీ దాదాపు 25 నుంచి 30 సీట్లను కోల్పోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఇక అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త వెనుకబడినట్లు కరపడుతుంది. మొదట్లో 31 నుంచి 33 సీట్లు గెలుస్తుందనే అంచనాలు ఉండగా.. ప్రస్తుతం 30-32 సీట్లకు పడిపోయింది. చివరి రెండు రోజుల్లో ఆప్ పుంజుకొని, బీజేపీ కాస్త వెనుకబడినట్లు కనపడింది. ఇక ఒంటరి పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం కష్టగానే కనిపిస్తోంది. ఆ పార్టీ 0-1 సీటు గెలుస్తుందని సట్టా బజార్ అంచనా వేస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినా.. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విశ్లేషకులు అంటున్నారు. డబుల్ డిజిట్ సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ అసలు ఖాతా తెరవడమే కష్టమనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల ఫలితాలపై భారీగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ, సీఎం ఆతిషి పోటీ చేస్తున్న కాల్కాజీ, మనీశ్ సిసోడియా పోటీ చేస్తున్న జంగ్‌పురా నియోజకవర్గాల ఫలితాలపై భారీగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ముగ్గురు ఆప్ అభ్యర్థులే గెలుస్తారని సట్టా బజార్ అంటోంది.
ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
ఢిల్లీలో కమలం, చీపురు పార్టీల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రకటించిన ఉచిత పథకాలు ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బస్సు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధులకు పెన్షన్లు, ఉచిత వైద్య సేవలు.. ఇలా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఏ వర్గాన్నీ వదలకుండా ఉచితాలను ప్రకటించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు పన్ను ఉండదని ప్రకటించింది. ఇది ఒక వర్గం ప్రజలను బీజేపీ వైపు తిప్పేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అర్వింద్ కేజ్రివాల్ ఎప్పటి నుంచో రూ.10 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన అడిగిన దానికంటే బీజేపీ ఎక్కువగానే ఇచ్చి వేతనజీవుల మనసులు కొల్లగొట్టింది. మధ్య తరగతి ప్రజలు ఊరట కలిగించేలా బీజేపీ బడ్జెట్‌లో అనేక ప్రతిపాదనలు చేసింది. ఇవి ఆప్ ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయి.
ఇక రాష్ట్రంలో ఉన్న 12.68 శాతం ముస్లింలు, 16.92 శాతం ఉన్న దళితులు మొదటి నుంచి ఆప్ వైపే ఉన్నారు. అయితే తాజాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మురికి వాడలను బీజేపీ నాశనం చేయదని, ఆప్ చేస్తున్నవి అబద్దపు ప్రచారాలని చెప్పారు. స్లమ్స్‌లో నివసిస్తున్న ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చని మోడీ హామీ ఇచ్చారు. దీనికి తోడు దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఆర్ఎస్ఎస్ ఇంటింటా ప్రచారం చేసింది. హర్యానా, మహారాష్ట్రలో ఏ విధంగా దళితులను తమ వైపు తిప్పుకుందో.. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పని చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు చీలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఆప్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉంది.
ఢిల్లీలో 71.7 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో మహిళల ఓట్లు ప్రతీ పార్టీకి కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు ఇస్తున్న ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను రూ.1,000 నుంచి రూ.2,100కు పెంచుతామని హామీ ఇచ్చింది. బీజేపీ అయితే ఏకంగా రూ.2,500 మహిళలకు అందిస్తామని వాగ్దానం చేసింది. ఈ పథకాలు మహిళల ఓట్లు రాలుస్తాయని రెండు పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి ఎవరు?
ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే అర్వింద్ కేజ్రివాల్ సీఎం అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కేజ్రివాల్‌ను ముందుంచి ఎన్నికలు వెళ్తోంది. అయితే బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. హర్యానా, మహారాష్ట్రలో కూడా బీజేపీ ఎన్నికల ఫలితాల తర్వాతే క్యాండిడేట్‌ను అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోడీ విజయాలను చూపించి బీజేపీ ఓట్లు అడుగుతోంది.
ష్.. సైలెన్స్..
సోమవారం సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఈ రెండు రోజులు ఎలాంటి ప్రచారం ఉండదు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం, ప్రకటించిన హామీలతో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఈ నెల 8న తెలిసిపోతుంది.






