ఢిల్లీ సీఎం అభ్యర్థి సస్పెన్స్‌కు రేపటితో తెర

by John Kora |   ( Updated:2025-02-16 14:27:48.0  )
ఢిల్లీ సీఎం అభ్యర్థి సస్పెన్స్‌కు రేపటితో తెర
X

- బీజేపీ ఆఫీసులో లెజిస్లేటీవ్ పార్టీ మీటింగ్

- అంతకు ముందు పార్లమెంటరీ పార్టీ సమావేశం

- కొత్త నాయకుడిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం ఎవరనే విషయంలో వారం రోజులుకు పైగా నడుస్తున్న సస్పెన్స్‌కు సోమవారంతో తెరపడనుంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో గెలిచిన బీజేపీ.. సీఎం ఎంపిక విషయంలో తాత్సరం చేస్తోంది. ఒక వైపు సీఎం అభ్యర్థి రేసులో చాలా మంది ఆశావహులు ఉండటం.. మరో వైపు ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లడంతో ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యం అయ్యింది. ఏప్రిల్ 8న ఫలితాలు వచ్చినా.. ఇప్పటి వరకు ఢిల్లీ సీఎం, కేబినెట్ విషయంలో బీజేపీ తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆదివారం రాత్రి ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రావడంతో బీజేపీ కీలక సమావేశాలు ఏర్పాటు చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిలీ బీజేపీ కార్యాలయంలో లెజిస్లేటీవ్ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు హాజరై.. తమ కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు.

పీఎం మోడీ ఢిల్లీకి చేరుకోనుండటంతో సోమవారం ముందుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడే ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని పార్టీ హైకమాండ్ నిర్ణయించనుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసిన అభ్యర్థినే.. బీజేపీఎల్పీ మీటింగ్‌లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. కాగా ఈ నెల 18 లేదా 19న ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి.

ఢిల్లీ సీఎం అభ్యర్థి రేసులో ప్రముఖంగా పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పర్వేష్ వర్మ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్‌ను ఓడించారు. పైగా పర్వేష్ వర్మకు జాతీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీనియర్ మహిళా నాయకురాలు రేఖా గుప్తా పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. వీరితో పాటు సీనియర్ బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సతీశ్ ఉపాధ్యాయ్‌లు కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. ఇక రోహ్‌తక్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన జితేంద్ర మహాజన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాడు మాత్రమే కాకుండా, ఆర్ఎస్ఎస్‌లో పని చేసిన అనుభవం జితేంత్రకు బలంగా మారింది.

దేశ రాజధానిలో మహిళా సీఎంను నియమించడం ద్వారా ఒక సందేశాన్ని పంపాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో రేఖా గుప్తాతో పాటు గ్రేటర్ కైలాశ్ నుంచి గెలిచిన శిఖా రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆప్ అగ్రనాయకుడు సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన శిఖా రాయ్‌కు మద్దతుగా బీజేపీలో పలువురు అగ్రనాయకులు తమ వాయిస్ వినిపిస్తున్నారు.

Next Story