భారీగా ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే

by Ajay Maddhiboyina |

శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మంత్రినిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ అనేక ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు సంబంధించిన అనేక వస్తువుల ధరలు తగ్గే అకాశం ఉంది.

భారీగా ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే
X

- సుంకాలు తగ్గింపుపై బడ్జెట్‌లో ప్రకటన

- క్యాన్సర్ ఔషధాలు, ఫిష్ ఫీడ్ దిగుమతి సుంకం తగ్గింపు

- విదేశీ మోటార్ బైకుల ధరలు తగ్గే అవకాశం

- లెదర్ ప్రొడక్టులపై కూడా పన్నులు తగ్గింపు

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర బడ్జెట్ 2025లో మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువల సుంకాలను తగ్గించారు. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. క్యాన్సర్ ఔషధాల నుంచి విదేశీ మోటార్ బైకుల వరకు ఈ లిస్టులో ఉన్నాయి. శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మంత్రినిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ అనేక ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు సంబంధించిన అనేక వస్తువుల ధరలు తగ్గే అకాశం ఉంది.

  1. క్యాన్సర్‌తో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 రకాల ఔషధాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని ఎత్తివేశారు. దీంతో పాటు మరో 37 ఔషధాలపై కూడా ప్రాథమిక దిగుతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని వల్ల ఈ ఔషధాలను ఉపయోగిస్తున్న రోగులకు ఉపషమనం లభించనుంది.
  2. ఫిష్ పాశ్చరీపై ప్రస్తుతం ఉన్న 30 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు. దీంతో ఆహారం, వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి లబ్ది చేకూరుతుంది. ఇకపై తక్కువ ధరకే ప్రాసెసింగ్, పంపిణీ చేసే అవకాశం ఏర్పడింది.
  3. ఆక్వా ఫీడ్ తయారిలో ఉపయోగించే ఫిష్ హైడ్రోలైసేట్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
  4. పెపరాజైన్ లేదా పెరిమడైన్ రింగ్ వంటి కెమికల్ కాంపౌండ్స్‌పై సుంకాన్ని కూడా 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు.
  5. ఫుడ్, డ్రింక్ పరిశ్రమల్లో ఉపయోగించే సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్, మరికొన్ని సబ్‌స్టెన్స్‌లపై ఉన్న దిగుమతి సుంకాన్ని100 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి తగ్గించారు. ఇది ఫుడ్, బేవరేజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమల వారికి భారీగా లబ్ది చేకూర్చనుంది.
  6. కోబాల్డ్ ప్రొడక్ట్స్‌, ఎల్‌ఈడీ, జింక్, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్‌తో పాటు 12 క్రిటికల్ మినరల్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు.
  7. ప్లాటినమ్‌తో తయారు చేసిన వస్తువులపై కూడా 25 శాతం ఉన్న సుంకాన్ని 6.4 శాతానికి తగ్గించారు.
  8. హస్తకళలను ప్రోత్సహించే చర్యలో భాగంగా వీటి ఎగుమతి సుంకాలను, ముడిసరుకు సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
  9. ఓడల తయారీలో ఉపయోగించే ముడి సరుకుపై మరో 10 ఏళ్ల వరకు దిగుమతి సుంకాన్ని ఎత్తేసింది.
  10. లెదర్ కంపెనీలు ఉపయోగించి ముడి లెథర్ (బ్లూ లెదర్) దిగుమతిపై కూడా సుంకాలను రద్దు చేసింది. దీంతో బ్యాగులు, బెల్టులు, జాకెట్లు, పర్సుల వంటి వస్తువుల ధరలు తగ్గనున్నాయి. షూలు ఇతర ప్రొడక్ట్స్‌లో ఉపయోగించే క్రస్ట్ లెదర్ సుంకాన్ని పూర్తిగా ఎత్తేసింది.
  11. యూఎస్‌బీ కేబుల్స్, వైర్డ్ హెడ్ సెట్, మైక్రోఫోన్, రిసీవర్ల తయారీలో ఉపయోగించే ముడి సరుకుపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశారు. దీంతో దేశీయంగా తయారయ్యే ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
  12. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 1600 సీసీ కంటే తక్కువ ఉండే మోటార్ బైకులపై కస్టమ్స్ డ్యూటీని 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న బైక్ ధరపై ఉన్న 50 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించింది.

Next Story