నిమిష ప్రియ కేసు.. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ?

by Naga Rani Yarlagadda |

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్ సర్కార్ ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ తన పాస్ పోర్టు తీసుకుని ఇవ్వకపోవడంతో.. దానికోసం అతనికి మత్తు మందు ఇవ్వగా అది కాస్తా డోస్ పెరిగి అతను మరణించాడు.

నిమిష ప్రియ కేసు.. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ?
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్ సర్కార్ ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ తన పాస్ పోర్టు తీసుకుని ఇవ్వకపోవడంతో.. దానికోసం అతనికి మత్తు మందు ఇవ్వగా అది కాస్తా డోస్ పెరిగి అతను మరణించాడు. ఈ కేసులో నిమిషప్రియకు ఉరిశిక్ష ఖరారవ్వగా.. మరికొద్ది గంటల్లో నిమిష శిక్షను అమలు చేయాల్సి ఉంది. ఆమె శిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోన్న తరుణంలో.. యెమెన్ ఉరిశిక్షను వాయిదా వేసింది. బ్లడ్ మనీ ఇచ్చి ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కేంద్రం చర్చలు జరుపుతోంది. అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి ? శిక్షకు బదులుగా డబ్బులిస్తే తప్పించుకోవచ్చా ? యెమెన్ చట్టాలు ఏం చెప్తున్నాయి?

బ్లడ్ మనీ అంటే ఇస్లామిక్ షరియా చట్టంలో దియా అని పిలిచే ఒక ఆర్థిక పరిహార విధానం. ఇది యెమెన్ వంటి షరియా చట్టాలను అనుసరించే దేశాల్లో అమలులో ఉంది. దీని ప్రకారం హత్య లేదా గాయపరిచిన నేరంలో నిందితులైనవారు.. బాధితుడి కుటుంబానికి లేదా అతనికి ఆర్థిక పరిహారం చెల్లించి వారి నుంచి క్షమాభిక్ష పొందితే శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబం ఈ పరిహారాన్ని అంగీకరిస్తే నిందితుడిని క్షమించి ఉరిశిక్ష వంటి కఠిన శిక్షల నుంచి విముక్తి చేయవచ్చు. ఈ విధానం షరియా చట్టంలో క్షమాగుణాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించారు. నిమిష ప్రియ కేసులో బ్లడ్ మనీ రూ. 8.6కోట్లుగా నిర్ణయించారు. ఒక వేళ వారి కుటుంబం పరిహారాన్ని తిరస్కరిస్తే.. యెమెన్ చట్టాల ప్రకారం శిక్షను యథావిధిగా అమలు చేస్తారు.

యెమెన్ లో ప్రస్తుతం రెండు సమాంతర ప్రభుత్వాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ అండ్ హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలోని సుప్రీం పొలిటికల్ కౌన్సిల్. నిమిషప్రియ సనా సెంట్రల్ జైల్లో ఉండగా.. ప్రస్తుతం అది హౌతీల నియంత్రణలో ఉంది.

Next Story