- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ.. ఈసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant), జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిల త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఓటర్ల పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు లేదా స్పెల్లింగ్ మార్పులు ఉన్నంత మాత్రాన వారికి నోటీసులు జారీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) ఆదేశించింది. ప్రముఖ బెంగాలీ కవి, ఆనంద పురస్కార గ్రహీత జోయ్ గోస్వామిని కూడా ఓటర్ల జాబితాలో గుర్తించని వ్యక్తిగా పేర్కొనడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అటువంటి ప్రముఖుల విషయంలో నోటీసులు ఇచ్చే ముందు అధికారులు విచక్షణతో వ్యవహరించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.
ఇక పేర్ల స్పెల్లింగ్స్‌లో తేడాలు కేవలం ప్రాంతీయ యాస వల్ల వస్తాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. బెంగాలీ భాషా ఉచ్ఛారణకు, ఇతర భాషలకు ఉన్న తేడాలను గుర్తించాలని, ఇందుకు బెంగాలీ భాష తెలిసిన అధికారుల సహాయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు ఓటర్ల పేర్లను ఇష్టానుసారంగా తొలగిస్తున్నారన్న సీఎం ఫిర్యాదుపై కోర్టు స్పందిస్తూ.. అవసరమైతే ప్రతి పత్రాన్ని బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ధృవీకరించేలా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చింది.
మమతా వాదనలు ఇలా..
అయితే, ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై కేసులో తన వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు పారదర్శకంగా లేవని, దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్రతికి ఉన్న వారిని కూడా చనిపోయినట్లుగా చూపించడం, వివాహమైన మహిళల పేర్లు మార్పు చెందితే వారికి నోటీసులు ఇవ్వడం వంటి అంశాలను మమతా బెనర్జీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.






