Bareilly: వధువుని అవమానించాలనుకున్న వ్యక్తికి షాక్

by Shamantha N |

అడిగినంత కట్నం ఇవ్వలేదని పెళ్లిలో వధువు కుటుంబం పరువు తీయాలనుకున్న వ్యక్తికి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన జరగింది.

Bareilly: వధువుని అవమానించాలనుకున్న వ్యక్తికి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: అడిగినంత కట్నం ఇవ్వలేదని పెళ్లిలో వధువు కుటుంబం పరువు తీయాలనుకున్న వ్యక్తికి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన జరగింది. బరేలీలో రవీంద్ర కుమార్‌(26)కు రాధా దేవికి(21) ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో, అమ్మాయి కుటుంబానికి ఎలాగైన బుద్ధి చెప్పాలని వరుడు డిసైడ్ అయ్యాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి పెళ్లి పీటలపైకి తప్పతాగి వచ్చాడు. అయితే, తాగిన మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో, వధువు కోపంతో ఊగిపోయింది. మద్యం మత్తులో తూగుతున్న వరుడి చెంప చెల్లుమనిపించింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

వధువు, వరుడు కుటుంబాలు పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు.. అదనపు కట్నం డిమాండ్‌, ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, వరుడు, అతడి స్నేహితులపై మరో కేసు నమోదైంది. కల్తీ మద్యం కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు.

Next Story