భారత్‌కు అన్‌లిమిటెడ్ ఇంధనం సరఫరా చేస్తాం: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-22 02:00:07  IST  )

భారత్ పర్యటనకు ముందు యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్‌కు అన్‌లిమిటెడ్ ఇంధనం సరఫరా చేస్తాం: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (Middle East) సంక్షోభం, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారులలో ఒకటైన భారత్‌కు ప్రధాన ఇంధన సరఫరాదారుగా మారేందుకు అగ్రరాజ్యం అమెరికా అడుగులు వేస్తోంది. మే 23న ప్రారంభం కానున్న తన తొలి న్యూఢిల్లీ పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మయామిలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఎంత కొనుగోలు చేయాలనుకుంటే అంత ఇంధనాన్ని తాము విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయని తెలిపారు.

ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఎనర్జీ ఎగుమతులను భారత్ కొనుగోలు చేసేలా చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని రూబియో తెలిపారు. భారతదేశానికి ఇంధన భద్రత కల్పించే క్రమంలో వెనెజువెలా చమురు ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. వచ్చే వారం వెనెజువెలా (Venezuela) తాత్కాలిక ప్రెసిడెంట్ కూడా భారత్‌లో పర్యటించనున్నట్లుగా మార్కో్ రూబియో వెల్లడించారు.

Next Story